
పీఆర్‌లో కారుణ్య నియామకాలు
హన్మకొండ:పంచాయతీరాజ్ శాఖలో ఎట్టకేలకు కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. 2016 నుంచి ఎదురుచూస్తున్న కు టుంబాలకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం 2024 మే నెలలోపు నమోదు చేసుకున్న వారికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో అటెండర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్‌లుగా అప్‌గ్రేడ్ చేసింది. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో ఉద్యోగం చేస్తూ విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తుంది. జిల్లా ప్రజాపరిషత్‌లలో కేవలం అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో చేరేందుకు బీటెక్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులు చదివిన కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ లేకపోవడం, ఉన్న పోస్టుల్లో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులను జిల్లా ప్రజాపరిషత్‌లో సర్దుబాటు చేయడంతో అవి భర్తీ అయ్యాయి. దీంతో కారుణ్య నియామకాల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు.
అటెండర్ టు జూనియర్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్
ఈక్రమంలో ప్రభుత్వం అటెండర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్‌లోని 58, వరంగల్‌లో 26 పోస్టులు అప్‌గ్రేడ్ కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వంనుంచి అమోదం లభించింది. వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌లో మరో 9 సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. హనుమకొండకు సంబంధించి 46 మంది, వరంగల్‌కు 28 మంది హాజరయ్యారు. మిగతా వారు ఎప్పుడు వచ్చినా అవకాశం కల్పిస్తామని ఆయా జిల్లాల ప్రజాపరిషత్ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల జాబితాను కలెక్టర్ల ఆమోదం కోసం పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
హనుమకొండ జిల్లాలో 58,
వరంగల్ జిల్లాలో 35 పోస్టులు
2016 నుంచి ఎదురుచూపులు
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి రెండు రోజుల్లో ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment