
వరంగల్‌లో పోలీస్ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్
హన్మకొండ: వరంగల్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొలను సంతోశ్‌రెడ్డి, గంట రవికుమార్ విమర్శించారు. శుక్రవారం హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరంగల్‌లో పోలీసు వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అని ఆరోపించారు. హనుమకొండలో ఒక ముస్లిం అమ్మాయికి ఉద్యోగం చూపించినందుకు సాయి చరణ్ అనే యువకుడిని వరంగల్ మహానగరం అంతా తిప్పుతూ.. కర్రలు, బెల్టులతో ఆ వర్గానికి చెందిన 30 మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేస్తే 26 మంది దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇటీవల చైన్నెలో ఎన్‌ఐఏ వాళ్లు పట్టుకునే వరకు వరంగల్ నగరంలో బిర్యానీ సెంటర్ నడిపే వ్యక్తి ఒక మత సంస్థకు జాతీయ అధ్యక్షుడని.. అతడు వరంగల్‌లో ఉన్నాడని తెలియని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉందని విమర్శించారు. ఇటీవల వెలుగు చూసిన ఓ సెక్స్ రాకెట్‌లోనూ ఆ వర్గం యువకులే కీలకమన్నారు. స్థానిక మంత్రి కొండా సురేఖ అండదండలతోనే వరంగల్ నగరంలో ఒక వర్గం వారు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్, రత్నం సతీశ్ షా, నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్, సంపత్‌రెడ్డి, సండ్ర మధు, తిరుపతి పాల్గొన్నారు.
బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు సంతోశ్‌రెడ్డి, రవికుమార్