
‘చపాట’కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, వరంగల్/దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో 80 ఏళ్ల నుంచి రైతులే విత్తనాలు తయారు చేసుకుని పండిస్తున్న వరంగల్ చపాట మిరప ఇక అంతర్జాతీయంగా ప్రాచూర్యం పొందనుంది. 2024 నవంబర్‌లోనే ఈ మిరపకు అంతర్జాతీయస్థాయి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించినా.. తాజాగా ఉగాది పండుగ వేళ తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘానికి పేటెంట్ కల్పిస్తూ కేంద్ర భౌగోళిక గుర్తింపు సంస్థ ఉత్తర్వులిచ్చింది. చైన్నెలోని ఇండియన్ పేటెంట్ సంస్థ జీఐ ట్యాగ్ సర్టిఫికెట్ జారీ చేసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈచపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం ఇండియన్ పేటెంట్ ఆఫీస్ చైన్నె సంస్థకు 2022లో దరఖాస్తు చేస్తే మూడేళ్లకు అధికారికంగా పేటెంట్ లభించింది. వరంగల్ చపాట మిరపలో రంగు ఎక్కువగా ఉండడం, కారం తక్కువగా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడంతో 18వ ఉత్పత్తిగా జీఐ ట్యాగ్ లభించింది.
ఫలించిన తిమ్మంపేట మిరప రైతుల కృషి..
దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో 300 మంది మిరప రైతులు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరున రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిర్చికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. తమ సొంత లోగో, బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో చపాట మిర్చి 6,738 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ప్రతీ ఏడాది 10,951 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు 20,574 మంది రైతులు జీఐ ట్యాగ్ ద్వారా లబ్ధి పొందనున్నారు.
‘తిమ్మంపేట’ మిరపకు జీఐ ట్యాగ్ సర్టిఫికెట్ జారీ
సొంత లోగో, బ్రాండ్‌తో అమ్ముకునే వీలు