
‘ఎండాకాలం’ అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: వేసవి దృష్ట్యా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వేసవికాలానికి సంబంధించిన ఆయా శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేలా బ్యానర్ల ఏర్పాటు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు పాఠశాలలు, పని ప్రదేశాల వద్ద అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నగరంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ తరగతి గది వద్ద నీటి కుండను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి 87126 99150, హనుమకొండ ఫైర్ స్టేషన్ 87126 99304, పరకాల ఫైర్ స్టేషన్ 87126 99306 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.