
‘పోషణ పక్షం’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పోషణ పక్షం–25 ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో నేటి(మంగళవారం) నుంచి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ శిక్షణ కోర్సులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈనెల 17 నాటికి 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సుల్లో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఆయా దరఖాస్తులు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులకు మే 1 నుంచి జూన్ 11 వరకు 42 రోజుల శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
రేపు జెడ్పీలో
పాత వాహనాల వేలం
హన్మకొండ: జిల్లా ప్రజాపరిషత్‌లో తుప్పు పట్టిపోతున్న పాత వాహనాల్ని వేలం వేయాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో ఫిబ్రవరి 25న ప్రచురితమైన ‘మట్టిలో కలవాల్సిందేనా’ ఫొటో ఫీచర్‌కు జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. తుప్పు పడుతున్న 10 పాత వాహనాలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈనెల 9న ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొనాలని హనుమకొండ జెడ్పీ సీఈఓ ఎం. విద్యాలత కోరారు.
శిక్షణ సంస్థలనుంచి
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: నిరుద్యోగ క్రిస్టియన్ మైనార్టీ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి టి.రమేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఎస్‌డీసీ, టాస్క్, ఈజీఎంఎం, మెప్మా, ఎంఎస్‌ఎంఈ, అనుసంధానం కలిగిన అర్హత ఉన్న శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంస్థలు పూర్తి వివరాలతో హనుమకొండ సుబేదారిలోని షరీఫన్ మసీదు ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12లోగా గడువు ఉందని పేర్కొన్నారు.
మావోయిస్టులు
అజ్ఞాతం వీడాలి
వరంగల్ క్రైం: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల రివార్డును సోమవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, తిరుమల్, ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
కౌన్సెలింగ్ పూర్తి
ఎంజీఎం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌కు 11 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఒక్క అభ్యర్థీ హాజరు కాలేదని, అలాగే దివ్యాంగుల కోటాకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందుకు ఖాళీగా ఉంచినట్లు పేర్కొన్నారు.

‘పోషణ పక్షం’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

‘పోషణ పక్షం’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ