
గోదావరి పరీవాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
హన్మకొండ: వాతావరణ శాఖ ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. సోమవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ ఏదైనా అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడితే, ట్రిప్పింగ్స్, బ్రేడౌన్‌లు సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీస్‌ల మంజూరు వేగవంతం చేయాలన్నారు. అత్యవసర సమయంలో కావాల్సిన మెటీరియల్‌ను సమకూర్చుతామన్నారు. వ్యవసాయానికి అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ సర్కిల్‌లో ఎల్‌సీ యాప్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్ టి.సదర్‌లాల్, జీఎంలు, ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
సిక్కిం గవర్నర్‌ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ సోమవారం సిక్కిం గవర్నర్ ఓమ్ ప్రకాశ్ మాథూర్‌ని ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వంతు సహకారం, ఆశీస్సులు ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని యశ్వంత్‌కు గవర్నర్ సూచించారు. పట్టుదలతో ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలను అధిరోహించి భారత దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయాలని యశ్వంత్‌ను గవర్నర్ దీవించారు.

గోదావరి పరీవాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలి