
పౌరులెవరో.. అటెండర్లు ఎవరో?
వరంగల్ అర్బన్ : బల్దియా ప్రధాన కార్యాలయానికి వస్తే పౌరులెవరో...అటెండర్లు ఎవరో అర్థం కాని పరిస్థితి ఉందని నగర మేయర్ గుండు సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో ఆమె అకస్మికంగా తనిఖీలు చేశారు. అటెండర్లు అందరూ డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. ఒక్కో చాంబర్‌కు ఇద్దరు, ముగ్గురు చొప్పన విధులు నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అంతర్గత బదిలీలు చేయాలన్నారు. పౌరసేవ కేంద్రంలో ఎల్‌ఆర్‌ఎస్, యువ వికాసం, తదితర ఫిర్యాదులు, వాటి నివృత్తి చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. గమనించిన మేయర్ ఆ హెల్ప్‌డెస్క్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అకౌంట్స్ సెక్షన్‌లో ఇటీవల కొంతమంది ఉద్యోగులు విధుల్లో చేరినందున వారికి శిక్షణ ఇప్పించి, సేవలను వినియోగించుకోవాలన్నారు. పబ్లిక్ హెల్త్, సీ 1 సెక్షన్, పింఛన్ సెక్షన్లను పరిశీలించారు. ఇన్‌వార్డ్, కంట్రోల్ రూమ్, జనన మరణ ధ్రువీకరణ విభాగాలను తనిఖీ చేసి జాబ్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ పట్ల మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యాంటిన్ వైపు మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు. బల్దియా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రజారోగ్యం అధికారిని ఆదేశించారు. కౌన్సిల్ హాల్ పునరుద్ధరణ, నవీకరణ పనులను మేయర్ పరిశీలించారు. తనిఖీల్లో అడినషల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఎంహెచ్‌ఓ రాజేష్, హెచ్‌ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, జేఏఓ జగదీశ్వరి, సూపరింటెండెంట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
అటెండర్లు డ్రెస్ కోడ్ పాటించాల్సిందే
మేయర్ గుండు సుధారాణి ఆదేశం
బల్దియా ప్రధాన కార్యాలయంలో
అకస్మిక తనిఖీలు