
ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు
హన్మకొండ : పట్టణ ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సరిపడా స్థలాలు లేవని, ఇండోర్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్, కరీంనగర్‌లో ఇండోర్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. మంగళవారం నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో హనుమకొండ సర్కిల్(జిల్లా) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్, సెక్షన్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. దేవునూరు, క్యాతంపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న 11 కేవీ లైన్ల వివరాలు అడిగి తెలుసుకుని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ పనిలో సాంకేతికను వినియోగించాలని సూచించారు. డ్రోన్ ద్వారా పోల్ టు పోల్ సర్వే చేయించి గుర్తించిన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. భవిష్యత్‌లో ఎక్కడైనా విద్యుత్ లైన్ వేసేందుకు అనుకూలం లేని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తామని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలతో అంతరాయాలు ఏర్పడినప్పడు ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్‌కు విధిగా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్లు కాకుండా విధిగా టాంగ్ టెస్టర్ రీడింగ్ తీసుకోవాలని, 60శాతం కంటే లోడ్ పెరిగే అవకాశం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా డీఈలను (టెక్నికల్) సెఫ్టీ అధికారులుగా నియమించామన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్‌లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, తిరుమల్ రావు, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, ఎస్‌ఈలు, డీఈలు,ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఉద్యోగుల భద్రతకు ప్రాధ్యాన్యం
విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రంలో హనుమకొండ జిల్లాలోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు, ఆర్టిజన్ సిబ్బందితో నేరుగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేసి సర్కిల్ కార్యాలయం టెక్నికల్ డీఈలను సేఫ్టీ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. అదే విధంగా రూ.కోటి బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
డ్రోన్ ద్వారా పోల్ సర్వే చేయాలి
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి