
రాజ్యాంగ రక్షణకు ముందుకురావాలి
అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం
రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్
హన్మకొండ: కేంద్ర పాలకులు ప్రజావ్యతిరేక విధానాల ద్వారా భారత జాతిని, భారత రాజ్యాంగాన్ని, ప్రమాద పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు.. రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ప్రజాస్వామ్య వాదులంతా రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కే.వి.ఎల్. పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం’ అనే నినాదంతో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నాడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు వృథా కాకూడదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మేడిపల్లి శోభన్, నాయకులు దొమ్మాటి ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, మంచాల రమాదేవి, వెంకటరాజం, సూర్యం, మద్దెల ఎల్లేశ్, నాగరాజు, పల్లేరు దామోదర్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి, ఉపాధ్యక్షుడు నిధి పాల్గొన్నారు.