
బదిలీల కలకలం!
వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మళ్లీ బదిలీల కలకలం మొదలైంది. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని పలువురు ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, ఇన్‌స్పెక్టర్‌లకు స్థానచలనం తప్పదన్న చర్చ జరుగుతోంది. ఇతర జిల్లాల్లో పని చేస్తున్న పలువురు అధికారులు ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఆశీస్సులు పొందడంతో పాటు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించుకున్నారు.
పోలీసుశాఖలో
మళ్లీ ట్రాన్స్‌ఫర్లు
● త్వరలోనే కొందరు ఏసీపీలు,
ఎస్‌హెచ్‌ఓలకు స్థానచలనం?
● కీలక ఠాణాల
కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు
● పోస్టింగ్‌లకు ప్రజాప్రతినిధుల
సిఫారసులే కీలకం..
● పోలీసుశాఖపై పట్టు బిగిస్తున్న సీపీ.. తనిఖీలు, సమీక్షలతో బిజీబిజీ
సాక్షిప్రతినిధి, వరంగల్ :
రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల క్రితం ఐపీఎస్ అధికారుల మూకుమ్మడి బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం కమిషనర్‌గా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సన్‌ప్రీత్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. సమీక్షలు, సమావేశాలు, ఠాణాల ఆకస్మిక సందర్శనలతో బిజీబిజీగా ఉన్న పోలీస్ కమిషనర్.. కమిషనరేట్ పోలీసింగ్‌పై తనదైన మార్కు వేస్తున్నారు. ఇదే సమయంలో లాంగ్ స్టాండింగ్‌తో పాటు వివాదాస్పద పోలీసు అధికారులు కొందరికి స్థానచలనం తప్పదన్న ప్రచారంతో ఆశావహులు సిఫారసులకు పోటీపడడం చర్చనీయాంశం అవుతోంది.
వివాదంగా పలు విభాగాలు..
పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతలతో పాటు స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్స్ తదితర విభాగాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ విభాగాల్లో పని చేస్తున్న కొందరు తమ పనులు కాకుండా ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటూ చికాకు కలిగిస్తున్నారన్న చర్చ ఉంది. వివిధ స్థాయిల్లోని అధికారులు కొందరు తమ సన్నిహితులతో బహిరంగంగానే చర్చిస్తున్నారు. ప్రధానంగా నగరంలో కాసులు కురిపించే ‘భూదందా’ల్లో మితిమీరిన జోక్యంపై ఆయా శాఖల అధికారులు నొచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న కొందరు ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలపై సీపీ, డీజీపీల వరకు ఫిర్యాదులు వెళ్లాయన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రజాప్రతినిధి, కుటుంబసభ్యుల అండదండలున్న ఓ ఏసీపీ తన పరిధిలోని ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలను రాకుండా జాగ్రత్త పడుతున్నారన్న ప్రచారం ఉంది. ఆ అధికారి పరిధి ఓ ఠాణా ఎస్‌హెచ్‌ఓ ఓ హోంగార్డుతోపాటు క్రైం హెడ్‌కానిస్టేబుళ్ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారన్న చర్చ బహిరంగంగా సాగుతోంది. కమిషనరేట్ పరిధిలోని మరో ఏసీపీ పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్ పొందారన్న ప్రచారం పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. వరంగల్ నగరంలోని నాలుగు ఠాణాల్లో నిత్యం భూదందాలు, సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లగా.. ఓ ఠాణాలో 25 తులాలకుపైగా బంగారం రికవరీ కేసులో ‘ఖర్చు’ల కింద పెద్ద మొత్తంలో వసూలు చేయడంపై ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిబ్బందిపై బూతు పురాణం.. ఫోన్ పే ద్వారా డబ్బుల స్వీకరణ.. ‘మీరేమన్న చేసుకోండి నాకింతివ్వండి’ అంటూ ఎస్సైలకు టార్గెట్ విధించారన్న ఆరోపణల్లో ముగ్గురు ఎస్‌హెచ్‌ఓలపైనా శాఖాపరమైన విచారణ చేపట్టినట్లు సమాచారం.
గ్రేటర్ ఠాణాలపైనే అందరి గురి..
గ్రేటర్ వరంగల్ కమిషనరేట్ పోలీస్టేషన్లలో పనిచేసేందుకు కొందరు అధికారులు.. త్వరలో జరిగే బదిలీల కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్‌లు వేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు సన్ని హితులై ఉమ్మడి వరంగల్‌తో పాటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేస్తున్న ఓ ఏసీపీ గ్రేటర్ పరిధిలో పోస్టింగ్ కోసం పొరుగు జిల్లాలోని ఓ సీనియర్ మంత్రితో స్థానిక ప్రజాప్రతినిధులకు సిఫారసు చేయించుకున్నట్లు తెలిసింది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న కొందరు ఏసీపీలు సైతం ప్రధానమైన డివిజన్లపై గురిపెట్టినట్లు ప్రచారం జరుగుతుండగా, అందులో ఒక్కరిద్దరికి హామీ కూడా లభించినట్లు చెబుతున్నారు. కాగా హనుమకొండ, కేయూసీ, హసన్‌పర్తి, సుబేదారి, కాజీపేట, హసన్‌పర్తి, మట్టెవాడ.. నగరం చుట్టూ ఉన్న ధర్మసాగర్, ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట, ఎల్కతుర్తి తదితర ఠాణాల పోస్టింగ్‌లు పట్టేందుకు పోటాపోటీగా ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొన్ని ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలు చేరి ఏడాదైనా కాకపోయినప్పటికీ.. వివిధ కారణాలతో స్థానచలనం తప్పదన్న సమాచారంతో ఖర్చీఫ్‌లు వేసుకుంటుండడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది.

బదిలీల కలకలం!