
మిడ్కో కథలు చిరస్మరణీయం
దేవరుప్పుల : దేశంలో ప్రకృతి సంపదను కొల్లగొట్టే దోపిడీ వ్యవస్థ నిర్మూలన ఉద్యమవ్యాప్తిలో మిడ్కో కథలు ఆచరణాత్మకంగా చిరస్మరణీయమని పౌరహక్కుల సంఘం, ఏఎస్‌సీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, విమలక్క, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, విప్లవ సాహితి సంపాదకులు గుమ్ముడవెల్లి రేణుక సంస్మరణ సభ బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు బి.పద్మకుమారి అధ్యక్షతన జరిగింది. తొ లుత తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం వద్ద ఏర్పాటు చేసిన రేణుక చిత్రపటానికి పలువురు విప్లవ జోహర్లు అర్పించారు. అనంతరం ‘అందరసొంటి సావు కాదు’ శీర్షికన రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వామపక్ష పార్టీల సిద్ధాంతాలు నిర్వీర్యమయ్యే క్రమంలో ఆవిర్భవించిన నక్సల్స్ ఉద్యమాల వల్లే తెలుగు రాష్ట్రాల్లో భూస్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థ ని ర్మూలించే క్రమంలో గిట్టని పాలకవర్గాలు పోలీ సుల ఉక్కుపాదం మోపుతూ ప్రజాఉద్యమాలను అణిచివేశారని అన్నారు. ఈ క్రమంలోనే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల సాధనకు రేణుక నమ్మిన సిద్ధాంతం, మహిళలను చైతన్యవంతుల్ని చేసే క్రమంలో బీజేపీ సర్కార్ ఆపరేషన్ కగార్‌లో అసువులు బాసిందని పేర్కొన్నారు. రేణు క రచనలు భావితరాల ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి వాస్తవికతపై అధ్యయనం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రేణుక తల్లిదండ్రులు జయమ్మ, సోమయ్య మా ట్లాడుతూ తన కూతురుకు మరణంలేదు.. అక్షర ఉ ద్యమం ఉన్నంత వరకూ జీవిస్తుందంటూ కంటతడి పెట్టారు. అనంతరం విమలక్క, పల్స నిర్మల, సురేష్ సాంస్కృతిక కళాప్రదర్శనలతో అమరులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో రేణుక సోదరులు జీవీకే.ప్రసాద్, రాజశేఖర్, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, విరసం నాయకుడు అరుసువల్లి కృష్ణ, మాభూమి సంధ్య, బల్ల సావిత్రి, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, అమర్, ఏపీటీఎఫ్, టీవీవీ వేదిక, డీటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎర్రంరెడ్డి నర్సింహారెడ్డి, గురజాల రవీందర్, బి.గంగాధర్, ఓయూ జేఏసీ నాయకుడు ఇప్ప పృథ్వీరెడ్డి, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు బిల్లా తిరుపతిరెడ్డి, జీడి ఎల్లయ్య, పడమటింటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
పౌరహక్కుల సంఘం, ఏఎస్‌సీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, విమలక్క, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్
కడవెండిలో మావోయిస్టు నేత
గుమ్ముడవెల్లి రేణుక సంస్మరణ సభ

మిడ్కో కథలు చిరస్మరణీయం