
ఉత్కంఠ
ఆశావహుల్లో
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తీవ్రమైన పోటీ కారణంగా పదవులు ఎవరికి దక్కుతాయో అని ఆందోళన చెందుతున్నారు. మొత్తం పోస్టులు నాలుగు ఉండగా.. ఫైనాన్స్ డైరెక్టర్‌కు ప్రత్యేక అర్హతలు, మిగతా వాటికి అర్హతలు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉండి సీజీఎం స్థాయిలో పని చేసిన వారు మాత్రమే ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి అర్హులు. మిగతా మూడు పదవులకు ఇంజనీరింగ్ విభాగంలో సీఈ, సీజీఎంగా పని చేసిన వారు అర్హులు. డైరెక్టర్ పదవులకు ఈనెల 9న హైదరాబాద్‌లో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఫైనాన్స్ డైరెక్టర్ పదవికి నలుగురు, మిగతా వాటికి 21 మంది హాజరయ్యారు.
17 జిల్లాలు.. 299 మండలాలు..
రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా టీజీ ఎన్పీడీసీఎల్ 17 జిల్లాలు, 299 మండలాల్లో విస్తరించి ఉంది. 5,580 గ్రామాలు, 7,474 హామ్లెట్‌లకు విద్యుత్ పంపిణీ చేస్తున్నది. 68,62,858 విద్యుత్ సర్వీసులున్నాయి. 9 వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీజీ ఎన్పీడీసీఎల్‌లో అప్పటి సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్లు కొనసాగుతుండగా ప్రభుత్వం వారిని 2024 జనవరి 29న తొలగించి, జనవరి 30న నూతన డైరెక్టర్ల భర్తీకి నోటిిఫికేషన్ జారీ చేసి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రస్తుతం సీజీఎంలుగా పని చేస్తున్న అధికారులతో పాటు రిటైర్డ్ అధికారులు ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలలు, దరఖాస్తులు స్వీకరించిన 12 నెలల తర్వాత ఎట్టకేలకు డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది.
డైరెక్టర్ పోస్టుల భర్తీ ఇంటర్వ్యూలు పూర్తి
టీజీ ఎన్పీడీసీఎల్‌లో నాలుగు పోస్టులకు
గతేడాది జనవరిలో నోటిఫికేషన్
పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక.. సర్కారుకు నివేదిక!
తీవ్ర పోటీ
టీజీ ఎన్పీడీసీఎల్‌లో డైరెక్టర్ పదవుల కోసం ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్లు, సీజీఎంలతో పాటు ఇదే కంపెనీలో పని చేసి రిటైర్డ్ అయిన వారు, టీజీ ఎస్‌పీడీసీఎల్, జెన్‌కో, ట్రాన్స్‌కోలో పని చేస్తున్న సీజీఎంలు, చీఫ్ ఇంజనీర్‌లు, రిటైర్డ్ అయిన వారు దరఖాస్తు చేశారు. దీంతో డైరెక్టర్ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఇంటర్వ్యూలు పూర్తి కావడంతో వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందోననే టెన్షన్ దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఎలాగైనా పదవులు సాధించాలనే ఆలోచనతో ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నోటిఫికేషన్ విడదల చేసి దరఖాస్తులు స్వీకరించిన ఏడాది తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించడంతో వెంటనే భర్తీ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్‌చార్జ్ డైరెక్టర్‌లతో అవాంతరాలు లేకుండా పనులైతే జరుగుతున్నాయి. డిస్కంలు నష్టాల్లో కొనసాగుతున్న క్రమంలో డైరెక్టర్ల నియామకం ద్వారా ఆర్థిక భారం పడనున్నందున.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.