
భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం
రామన్నపేట : నగరంలోని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.28 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 2014 సంవత్సరం తెలంగాణ ఆవిర్భావం నాటికి అత్యంత శిథిలావస్థకు చేరుకుందని, ఈ విషయాన్ని నాటి విద్యార్థి నాయకులు, విద్యార్థులు సాంకేతిక విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇటీవల పూర్వ విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్.. విషయం తెలియజేయడంతో నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి రూ.28 కోట్లు విడుదల చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలని సూచించినట్లు తెలిపారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ ఇంజనీరింగ్ విద్య అందించడమే కాకుండా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్, స్వయం ఉపాధి పథకాల ద్వారా వారికి ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్, రామ్‌ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ.వి శ్రీనివాస్‌రావు, మేకల అక్షయ్‌కుమార్, శ్రీవిద్య, కుమ్మరి వేణు, బానోత్ వెంకన్న, రవితేజ, కుమార్, దయాకర్, శ్రీ లేఖ, కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామనారాయణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
పాలిటెక్నిక్ కళాశాల
భవన నిర్మాణానికి భూమి పూజ