
పాఠకులకు సదుపాయాలు కల్పించండి
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
● జిల్లా గ్రంథాలయంలో వసతుల పరిశీలన
హన్మకొండ చౌరస్తా : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిత్యం వచ్చే పాఠకుల కోసం ఏసీలు, చల్లటి తాగునీటి కోసం రిఫ్రిజిరేటర్లు తదితర సదుపాయాలు కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించి వసతులు, పెండింగ్ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను సమస్యలు, అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రూ.80లక్షలతో చేపట్టిన ఆడిటోరియం నిర్మాణం నిలిచిపోవడానికి కారణాలను లైబ్రరీ సిబ్బందిని అడగ్గా.. మరో రూ.13లక్షల వరకు నిధులు అవసరమని ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు అందించామని వివరించారు. కాగా లైబ్రరీకి వస్తున్న సెస్ నిధుల నుంచి ఆడిటోరియం పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ.అజీజ్‌ఖాన్, లైబ్రరీ సిబ్బంది మల్సూర్, పురుషోత్తంరాజు, సంతోశ్, గుడికందుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.