
సన్న బియ్యం ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే..
వరంగల్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పులోని 12వ డివిజన్ దేశాయిపేటకు చెందిన పూర్ణచందర్ ఆహ్వానం మేరకు వారి ఇంట్లో మంత్రి సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని వారి కుటుంబ సభ్యులు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మంత్రి కుటుంబంలోని మహిళలకు చీరలను బహుమతిగా అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కల అని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెరవేర్చారన్నారు. రేషన్ డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్ప డినా.. బియ్యాన్ని కల్తీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా 19వ డివిజన్ భగత్‌సింగ్ నగర్‌లో ఎస్‌డీఎఫ్ నిధులు రూ.33 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, పైపులైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో మేయర్ సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు కావేటి కవిత, బస్వరాజు కుమారస్వామి చింతాకుల అనిల్‌కుమార్, ఓని స్వర్ణలత, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి తహసీల్దార్ ఇక్బాల్, భాస్కర్ పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
లబ్ధిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం