
హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
● శ్రీచాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి
● భక్తిశ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర
ఖిలా వరంగల్: అఖండ భారతావని కోసం హిందువులందరూ సంఘటితమై హిందూ, సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం వరంగల్ రంగశాయిపేట మహంకాళీ దేవాలయ ప్రాంగణం వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీచాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి చాంముండేశ్వర మహర్షి ముఖ్యఅతిథిగా హాజరరై మాట్లాడారు. కాగా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మరావు, కొండేటి శ్రీధర్, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌తో కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాంకాళి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈయాత్ర ఉర్సు కరీమాబాద్, ఫ్లైఓవర్ మీదుగా బట్టల బజార్, ఎంజీఎం జంక్షన్, ములుగు రోడ్డు, హనుమకొండ జంక్షన్ మీదుగా పద్మాక్షి దేవాలయ ప్రాంగణం వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. కార్యక్రమంలో బీజేపీ నేతలు వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.
శోభాయాత్రకు భారీ భద్రత..
హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, పది మంది ఎస్సైలు, వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు