
కడియం రాజీనామా చేసే వరకు వదలం
● భూ చెర పడుతున్న ఆంధ్రా అల్లుడు, బినామీలు
● గురువులకు పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తుడు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హన్మకొండ: బీఆర్‌ఎస్ శ్రేణులు శ్రమించి గెలిపించిన కడియం శ్రీహరి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గులాబీ జెండామీద, బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టం మీద గెలిచిన కడియం శ్రీహరికి సిగ్గూ శరం, చీము నెత్తురుంటే వెంటనే రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచి మాట్లాడాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, తాటికొండ రాజయ్య, తనపై ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడారని, దీనిని కడియం విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఆంధ్రా అల్లుడు, బినామీలు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు చెరబట్టారని ధ్వజమెత్తారు. దేవునూర్‌లో 25 ఎకరాలు బినామీ పేరుతో కొనుగోలు చేసి వ్యవసాయం చేయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నీతివంతునివైతే హైదరాబాద్‌లో మూడు భవనాలు, అమెరికాలో మూడు భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయని, హనుమకొండలో అంత పెద్ద ఇల్లు ఎలా నిర్మించావని తూర్పారబట్టారు. కడియం కంటే తాను ఒక్క రోజు తన సొంత నియోజకవర్గంలో లేకున్నా రాజీనామా చేస్తానన్నారు. కడియం తన మొదటి గురువు ఎన్టీఆర్, రెండో గురువు చంద్రబాబు, మూడో గురువు కేసీఆర్‌కు పంగనామాలు పెట్టాడని, కొత్త గురువు రేవంత్ రెడ్డికి కూడా పంగనామాలు పెడతారని పల్లా దుయ్యబట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నాయకులపై కడియం శ్రీహరి నోరు పారేసుకోవడాన్ని ఖండించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్ మాట్లాడారు. సమావేశంలో నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, గున్‌రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, చింతల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.