
17 నుంచి ‘భూభారతి’ సదస్సులు
హన్మకొండ అర్బన్: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లో భూ భారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్టం గెజిట్ ప్రతులు, జీఓ పత్రాలు ప్రతి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈనెల 17 నుంచి ప్రతి మండలంలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహించే సదస్సులకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు భూమి హక్కులకు సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తులను, మీ సేవ కేంద్రాల ఆపరేటర్లను ఆహ్వానించాలని సూ చించారు. సందేహాల నివృత్తికి తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నూతన చట్టంలోని పలు అంశాలపై పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ నారాయణ,రాథోడ్ రమేశ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
అవగాహన కల్పించాలి : వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: ప్రభుత్వం అమలు చేయనున్న భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్‌లో భూభారతి చట్టంపై తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో ఈ చట్టంపై అవగాహన సదస్సులకు షెడ్యూల్ రూపొందించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రచారం నిర్వహించాలని జిల్లా పౌరసంబంధాల అధికారి అయూబ్‌అలీని ఆదేశించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి హెల్ప్‌లైన్ నంబర్ 040293 13999 ఏర్పాటు చేయాలని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలపై సమగ్రమైన నోట్స్ తయారు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
కలెక్టరేట్‌లో అధికారులకు అవగాహన

17 నుంచి ‘భూభారతి’ సదస్సులు