
హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు
కాళేశ్వరం: హత్యకేసులో నిందితుడికి భూపాలపల్లి జడ్జి నారాయణబాబు రూ.10వేల జరిమానా, జీవితౖఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన సంగిశెట్టి కిశోర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రహ్మణపల్లి ఇసుక క్వారీలో సూపర్ వైజర్‌గా పని చేస్తూ ఉండేవాడు. 2018లో కిశోర్ స్నేహితుడు, ఇసుక క్వారీ ఇన్‌చార్జ్‌గా పనిచేసే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన చోడవరపు నర్సింహామూర్తి మహదేవపూర్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన యువతి గోగుల లలితను ప్రేమ వివాహం చేసుకోవడానికి విజయనగరం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ యువతి తమ్ముడు గోగుల విజయ్ 2018 ఆగస్టు 26న నర్సింహామూర్తికి సహకరించాడనే కోపంతో కిశోర్‌ను గొడ్డలిలో నరికి చంపాడు. ఈ విషయమై మృతుడి తండ్రి సంగిశెట్టి దుర్గారావు మరుసటి రోజు 27న మహదేవపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ఎస్సై డి. విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా అప్పటి మహదేవపూర్ సీఐ రంజిత్ కుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత సీఐగా వచ్చిన అంబటి నర్సయ్య నిందితుడిపై చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు.. నిందితుడికి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై వివరించారు.
తీర్పు వెలువరించిన జడ్జి నారాయణబాబు