
నీతి ఆయోగ్‌లో గంగారం బ్లాక్‌కు మొదటి ర్యాంక్
గంగారం: దేశంలో ఆకాంక్షిత (ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం) మండలాల డెల్టా ర్యాంకింగ్స్‌లో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అగ్రస్థానం, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రెండో స్థానంలో నిలిచిందని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అధికారి శ్రీనాథ్ హాల్కే వెల్లడించారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సూచన మేరకు అన్నిశాఖల సమన్వయంతో కేత్రస్థాయిలో ఐదు థీమ్‌లు, 40 సూచికల ద్వారా లోపాలను గుర్తించి మెరుగుపరచడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. హెల్త్ అండ్ న్యూట్రిషీయన్, విద్య, సామాజికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో అభివృద్ధి సాధించడంతో గంగారం మండలం నీతి ఆయోగ్‌లో మొదటి ర్యాంకు సాధించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రకటించిన డిసెంబర్ మూడో త్రైమాసిక ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) డెల్టా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోనే గంగారం బ్లాక్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన బ్లాక్‌లలో పాలనను మెరుగుపర్చడం, జీవన నాణ్యతా ప్రమాణాలను పెంచడం లక్ష్యమన్నారు. బ్లాక్‌ల పనితీరు, సూచికల పురోగతిపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుందన్నారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల సంబంధిత అధికారులు మరింత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేసి అభివృద్ధికి బాటలు వేయాలని సీతక్క కోరారు.