
రెండు రోజుల శిక్షణలో కమిషనర్
వరంగల్: చైన్నెలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘స్పాంజ్ పార్క్ ఫ్రేమ్ వర్క్ ఫర్ రెసిలెంట్ ఓపెన్ స్పేసెస్’ కార్యక్రమంలో వరంగల్ బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే బుధవారం పాల్గొన్నారు. స్థిరమైన పట్టణాభివృద్ధి–స్మార్ట్ సిటీస్–ఐఐ (ఎస్‌యూడీఎస్–2) ప్రాజెక్టులో భాగంగా ఈశిక్షణ చైన్నెలో నిర్వహిస్తున్నారు. జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(బీఎంజడ్) తరఫున డ్యూయిష్ గెసెల్స్ చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్‌బీట్ (జీఐజడ్) మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్(ఏంఓహెచ్‌యుఏ) సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చేశారు. నగరాల్లో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం, డిజైన్ చేయడం, అమలు చేయడంతో పాటు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి పట్టణ అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు. పట్టణాల్లో సంభవించే వరదలను తగ్గించడం, భూగర్భ జలాలను పెంపొందించడం (రీఛార్జ్ చేయడం) పురపాలికల్లో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.