
వేసవిలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలి
హన్మకొండ: వేసవి కాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవర్లు విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని ఆర్టీసీ హనుమకొండ డిపోలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లకు వాటర్ క్యాన్లు, రుమాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ డ్రైవర్లు ఎండతోపాటు ఇంజన్ వేడి తట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో తగినంత తాగు నీరు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎండ నుంచి ఉపశమనానికి రుమాలు చుట్టుకోవాలన్నారు. డ్యూటీలో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించినా, డీ హైడ్రేషన్‌కు గరైనా వెంటనే ఓఆర్‌ఎస్ తీసుకోవాలన్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడగాలులు, ఎండ వేడి నుంచి కొంతైనా ఉపశమనం పొందొచ్చన్నారు. ఈ క్రమంలోనే హనుమకొండ డిపోలోని ప్రతీ డ్రైవర్‌కు జ్యూట్ బ్యాగుతో కూడిన 5 లీటర్ల వాటర్ క్యాన్, రుమాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించినట్లు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు కేశరాజు భానుకిరణ్, మహేశ్, హనుమకొండ డిపో ట్రాఫిక్ సూపర్‌వైజర్ నజియాసుల్తానా, మెకానిక్ సూపర్‌వైజర్ వి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ వరంగల్ రీజినల్
మేనేజర్ డి.విజయ భాను