
టెంట్‌సిటీ నిర్మాణాలు త్వరగా చేపట్టాలి
కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో టూరిజంశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన టెంట్‌సిటీ పనులు యుద్ధప్రాతిపాదికన చేట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు.. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. బుధవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో జరిగిన సరస్వతీ పుష్కరాల యాప్, వెబ్‌పోర్టల్ ప్రారంభ సమీక్షలో కలెక్టర్‌తో మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద తాత్కాలిక టెంట్‌సిటీ నిర్మాణాలకు రూ.83లక్షలు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. మేఘా, సింగరేణి, ఎన్‌టీపీసీల్లో ఏదో ఒక్క సంస్థకు అప్పగించి పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచారం. టెంట్‌సిటీ కోసం ఇప్పటికే కాళేశ్వరంలో దేవస్థానానికి సంబంధించిన గుడిమాన్యం భూమిలో ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రైతులకు కూడా పంటనష్టం అందజేశారు. కానీ నిర్మాణాలు మొదలు కాకపోవడంతో మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రెండు రోజుల్లో షార్ట్‌టెండర్స్ పిలిచి పనులు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆలయ వర్గాల సమాచారం.
వీఐపీ ఘాట్ వద్ద విగ్రహాల తొలగింపు
కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి)ఘాట్ వద్ద పుష్కఘాట్ విస్తరణలో భాగంగా వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టు కింద భక్తులు ఏర్పాటు చేసిన పలు దేవతా విగ్రహాలకు బుధవారం ఉద్వాసన పూజ చేసి తొలగించారు. కాగా, ఇటీవల కలెక్టర్ రాహుల్‌శర్మ సరస్వతీనది పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించిన సమయంలో ఘాట్‌పై ఉన్న వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టును తొలగించొద్దని, దేవతా విగ్రహాలను తొలగించి ప్రత్యేకంగా మళ్లీ ఓ చోట ఏర్పాటు చేయాలని అఽధికారులకు ఆదేశించారు. దీంతో తొలగింపు పనులు చేపట్టారు.
కలెక్టర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం