
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు
● ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్
కాజీపేట రూరల్ : ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ పేర్కొన్నారు. కాజీపేట 48వ డివిజన్ దర్గాలో శనివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ముఖ్య అతిథిగా విశ్వనాథ్ పెరుమాళ్ మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ఎంతకై నా తెగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, స్థానిక కార్పొరేటర్లు సర్తాజ్‌బేగం, సయ్యద్ విజయశ్రీరజాలి, జక్కుల రవీందర్‌యాదవ్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, రహిమున్నీసాబేగం, మిర్జా అజిజుల్లా బేగ్, తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
‘భూభారతి’తో రైతు సమస్యలు దూరం
హన్మకొండ : భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు దూరమవుతాయని, ఇక నుంచి రైతులు తమ భూ సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్లి రవి పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి 10,954 మంది గ్రామ పాలన అధికారులను తీసుకుంటున్న క్రమంలో ముందుగా జీఓ 129కి సవరణ చేసి పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులను ఎలాంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలిపారు.