
పెరుగుతున్న ఎండలు.. తస్మాత్ జాగ్రత్త!
ఎంజీఎం : ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించాలని, ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప బయటికి వెళ్లకూడదని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన నగరవాసులకు, జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు.
సూచనలు ఇలా..
● మంచినీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత మంచినీరు తాగాలి. అదేవిధంగా కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవపదార్థాలు తీసుకోవచ్చు.
● వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు బయట ఆడడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. వారిని ఉదయం లేదా సాయంత్రం పూటనే ఆడుకోవడానికి అనుమతించాలి.
● ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా చెవులకు వేడి గాలి తగలకుండా తలకు నిండుగా రుమాలు కానీ, ఖర్చీఫ్ కానీ చుట్టుకోవాలి.
● గొడుగు, టోపీ, రుమాలు లేదా.. ఇతర రక్షణ చర్యలు తీసుకోకుండా ఎండలో పనిచేసేవారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. సన్నని, వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది.
● వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం, నాలుక ఎండిపోవడం పాక్షిక లేదా అపస్మారక స్థితికి లోనయ్యే అవకాశం ఉంటుంది. పొడిచర్మం, చిరాకు, తలనొప్పి, శ్వాస పెరగడం, వికారం, వాంతులు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో శరీరాన్నంత తరచూ తుడుస్తూ ఉండాలి. వారికి కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్‌ఎస్ ద్రావణం లేదా కొంచెం ఉప్పు కలిపిన మజ్జిగను తాగిస్తూ ఉండాలి. పరిస్థితి గమనిస్తూ అవసరమైతే 108 వాహనం ద్వారా దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తప్పకుండా తీసుకువెళ్లాలి.
● ఉపాధి హామీ కార్మికుల విషయంలో సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదయం లేదా సాయంత్రం నాలుగు తర్వాతనే వారితో పని చేయించాలి. వారికి అవసరమైన మంచినీరు, సేద తీరడానికి నీడ వసతి ఏర్పాటు చేయాలి.
తగిన జాగ్రత్తలు పాటించాలి
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య

పెరుగుతున్న ఎండలు.. తస్మాత్ జాగ్రత్త!