
తెలంగాణ యాసకు జీవం పోసిన కేసీఆర్
హన్మకొండ: తెలంగాణ యాసకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జీవం పోశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి రూపొందించిన ‘ఎగిసెర బలే ఎగిసెర సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెర‘ అనే పాటను, అలాగే రిటైర్డ్ తహసీల్దార్ మహమ్మద్ సిరాజుద్దీన్ రచించిన పాటను, చిందు కళాకారుడు, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, రాకేష్‌రెడ్డితో కలిసి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. కవిత మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకు మనం మన తెలంగాణ యాసలో మాట్లాడితే హేళనగా చూసేవాళ్ళన్నారు. 2001లో కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టి మైకందుకుని తెలంగాణ యాస మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ మన యాసను సగర్వంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాయకుడు మానుకోట ప్రసాద్, జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్, రజినీసాయిచంద్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారికి పూజలు
ఎమ్మెల్సీ కవిత నగరంలోని శ్రీభద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో స్వాగతించగా, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రజతోత్సవ పాటల సీడీ ఆవిష్కరణ