
డాగ్ షెడ్ పనులు పూర్తి చేయండి: మేయర్ సుధారాణి
వరంగల్: డాగ్ షెడ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. హసన్‌పర్తి చింతగట్టులో జీడబ్ల్యూఎంసీ నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) కేంద్రాన్ని గురువారం మేయర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా డాగ్ షెడ్ ఆవరణను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిరోజూ 20 కుక్కలకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికితోడుగా నిర్మిస్తున్న అదనపు డాగ్‌షెడ్‌లో సివిల్ పనులు పూర్తయినందున ఆపరేషన్ థియేటర్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే మరో 20 కుక్కలకు అదనంగా ఆపరేషన్‌లు నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని కుక్కల కోసం నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, కుక్కల అధిక సంచార ప్రాంతాల్లో సుమారుగా 300 నీటి తొట్టెలను ఏర్పాటు చేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, వెటర్నరీ డాక్టర్ డా.గోపాల్‌రావు, ఈఈ సంతోశ్‌బాబు, డీఈ రవికిరణ్, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.