మత్తు ‘మందుల’ దందా! | - | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 24 2023 7:46 AM | Last Updated on Fri, Feb 24 2023 12:23 PM

- - Sakshi

రూ.40 లక్షల విలువైన టానిక్స్‌, టాబ్లెట్లు సీజ్‌

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం మాదకద్రవ్యాలపై యుద్ధం చేపట్టింది. వినియోగదారులు, విక్రేతలు, సరఫరాదారులతో పాటు సూత్రధారులనూ కటకటాల్లోకి నెడుతోంది. దీంతో కటకటలాడిపోతున్న మత్తుబానిసలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. సాధారణ రుగ్మతలు, శస్త్రచికిత్సల తర్వాత, అత్యవసర సమయాల్లో వాడే ఔషధాలను దొడ్డిదారిలో సేకరించి వినియోగిస్తున్నారు. దీనిని గుర్తించిన హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 15 మందిని అరెస్టు చేసి వీరి నుంచి రూ.40 లక్షల విలువైన కోడిన్‌ ఫాస్పేట్‌ టానిక్స్‌, అల్ఫాజోలమ్‌ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా నిషేధించిన దగ్గు మందు
దగ్గు, ఒంటి నొప్పుల నివారణ కోసం ఒకప్పుడు కోడిన్‌ ఫాస్పేట్‌ టానిక్‌ వినియోగించే వారు. ఇందులో వినియోగించే ముడిపదార్థాల వల్ల తీవ్రమైన మత్తు వచ్చేది. ఫలితంగా అనేక మంది ఈ ఔషధం వినియోగానికి బానిసలుగా మారడం మొదలెట్టారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018 జూలై నుంచి దీని తయారీ, విక్రయం, వినియోగాలను నిషేధించింది. అయినప్పటికీ ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో దీన్ని అక్రమంగా తయారు చేస్తున్నారు.

ఫర్హాబాద్‌కు చెందిన పవన్‌ అగర్వాల్‌ దీన్ని సేకరించి అమీర్‌పేటలో బయో–స్పైర్‌ మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు మహ్మద్‌ బషీర్‌ అహ్మద్‌కు సరఫరా చేస్తున్నాడు. ఇది ఇతడి ద్వారా సైదాబాద్‌ కాలనీ వాసి ఎ.సత్యనారాయణకు చేరుతోంది. ఎలాంటి లైసెన్సులు లేని ఇతను ఈ ఔషధాన్ని ఉప్పల్‌కు చెందిన అక్షయ మెడికల్‌ షాపు యజమాని పొచం వేణు ద్వారా అమ్మిస్తున్నాడు. రూ.40 ఖరీదైన ఈ సిరప్‌ను రూ.200కు విక్రయిస్తున్నారు. నాంపల్లి, మెహదీపట్నం, మలక్‌పేట, అంబర్‌పేటల్లోనూ కొందరు వ్యాపారులు ఈ మందును విక్రయిస్తున్నారు.

చీటీ పైనే అమ్మాల్సిన ఆల్ఫాజోలమ్‌...
మానసిక వైద్య చికిత్సలో వినియోగించే ఆల్ఫాజోలమ్‌ సంబంధిత మాత్రలను కేవలం డాక్టర్‌ చీటీ ఆధారంగా, సూచించిన ప్రమాణంలోనే విక్రయించాలి. దీనిని వినియోగిస్తే మత్తు రావడంతో అనేక మంది బానిసలవుతున్నారు. దీర్ఘకాలం వాడి రుగ్మతలకు గురవుతున్నారు. రాజస్థాన్‌లోని బయో ల్యాబ్‌ రెమిడీస్‌ సంస్థల్లో తయారయ్యే ఈ మాత్రలు కవాడీగూడకు చెందిన అజంత మెడికల్‌ ఏజెన్సీ ద్వారా కాచిగూడకు చెందిన గణేష్‌ ఫార్మాస్యూటికల్స్‌ నిర్వాహకుడు ఎ.వెంకట సురేష్‌ బాబుకు బిల్లులు లేకుండా హోల్‌సేల్‌గా వస్తున్నాయి.

ఇతను జి.పూర్ణ చందర్‌, ఎం.మల్లేష్‌లను డెలివరీ బాయ్స్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. వీరి ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెడికల్‌ షాపులు నిర్వహించే ఆర్‌.శ్రీనివాస్‌రెడ్డి, కె.వేణుగోపాల్‌, ఎం.శ్రీధర్‌, ఎం.పవన్‌కుమార్‌, మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌, మహ్మద్‌ అబ్దుల్‌ సమీ, జహిరుద్దీన్‌ అహ్మద్‌, నీరజ్‌ సింగ్‌లకు సరఫరా చేస్తున్నాడు. వీరు పరిచయస్తులైన కస్టమర్లను ఎలాంటి మందుల చీటీ లేకుండానే అమ్ముతున్నారు. 17 నుంచి 20 పైసల ఖరీదు చేసే ఈ టాబ్లెట్‌ రూ.12 కు విక్రయిస్తున్నారు.

స్పెషల్‌ డ్రైవ్స్‌కు నిర్ణయం...
సిటీలో జరుగుతున్న ఈ ఔషధాల అక్రమ దందాపై హెచ్‌–న్యూకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ పి.రమేష్‌ రెడ్డి నేతృత్వంలో ఎస్సై సి.వెంకట రాములుతో కూడిన బృందం వరుస దాడులు చేసి మొత్తం 15 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి 1,52,400 టాబ్లెట్లు, 1160 టానిక్స్‌ స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న మరో 10 మంది మెడికల్‌ షాపు నిర్వాహకుల కోసం గాలిస్తున్నామని చక్రవర్తి తెలిపారు.

ఈ దందాకు చెక్‌ చెప్పడానికి ఔషధ నియంత్రణ శాఖతో కలిసి శుక్రవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతామన్నారు. నియంత్రిత, నిషేధిత జాబితాలో ఉన్న ఔషధాల దందా చేస్తే కాస్మోటిక్స్‌ యాక్ట్‌ కాకుండా ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని, ఇవి నాన్‌–బెయిలబుల్‌ అని స్పష్టం చేశారు. 

వీటికి బానిసలుగా మారుతున్న యువత విచక్షణ కోల్పోయి నేరాలు కూడా చేస్తున్నారన్నారు. ఆయా మెడికల్‌ షాపుల లైసెన్సుల రద్దుకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది ఇలాంటి అక్రమ దందా చేస్తున్న 100 మెడికల్‌ దుకాణాల లైసెన్సులు రద్దు చేశామని, వీరితో పాటు కుటుంబీకులకు మరోసారి లైసెన్సు రాదని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement