ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నమోదైన తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్ ఉపాధ్యాయకు హష్ ఆయిల్ సరఫరా చేసిన లక్ష్మీపతి కోసం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతను దాదాపు ఆరేళ్లుగా డ్రగ్స్ దందాలో ఉన్నాడు. తొలినాళ్లలో గంజాయి సరఫరా చేశాడు. తర్వాత హష్ ఆయిల్ అమ్మడం ప్రారంభించాడు. ఈ క్ర మంలో 2020 నవంబర్ 27న మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఇతను హష్ ఆయిల్‌ని కల్తీ చేసి కూడా అమ్ముతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
శివార్లలోనే బస్సు దిగి..
సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని తులసి వనం కాలనీకి చెందిన ఓ పోలీసు అధికారి కుమారుడైన వీరపల్లి లక్ష్మీపతి బీటెక్ విద్యను మధ్యలో మానేశాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు అరకుతో పాటు విశాఖ ఏజెన్సీకి చెందిన అనేకమంది గంజాయి సరఫరాదారులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుంచి గంజాయి తీసుకువచ్చి రాజధానిలోని మూడు కమిషనరేట్లతో పాటు నల్లగొండలోనూ విక్రయించేవాడు. గంజాయిని పోలీసుల కళ్లుగప్పి తీసుకురావడం కష్టసాధ్యం కావడంతో తన పంథా మార్చాడు. అరకు మండలంలోని లోగిలి ప్రాంతానికి చెందిన నగేష్ సహాయంతో హష్ ఆయిల్ దందా మొదలెట్టాడు. నేరుగా ఏజెన్సీ ప్రాంతానికి వెళుతూ ఒక్కో విడత లీటర్ చొప్పున హష్ ఆయిల్ తీసుకునేవాడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణిస్తూ నగరానికి చేరుకునేవాడు. పోలీసు నిఘా తప్పించుకోవడానికి శివార్లలోనే బస్సు దిగిపోయి అక్కడి నుంచి అనుచరుల వాహనాలపై తన అడ్డాకు చేరుకునేవాడు.
పలు ఠాణాల్లో కేసులు
బీరంగూడలోని వందనపురి కాలనీకి చెందిన మోహన్‌రెడ్డి ఇతడికి ప్రధాన అనుచరుడిగా చాలాకాలం పని చేశాడు. లక్ష్మీపతిపై గంజాయి, హష్ ఆయిల్ విక్రయాలకు సంబంధించి విశాఖపట్నం, నల్లగొండ, హయత్‌నగర్ ఠాణాల్లో కేసులు ఉన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ తన అడ్డా మార్చేసేవాడు. ఇలా జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని తన దందా కొనసాగించాడు. మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్న సందర్భంలో మణికొండలోని చిత్రపురి హిల్స్‌లో నివసించేవాడు.
ఖరీదు లక్ష..రూ.3 లక్షలకు విక్రయం
లక్ష్మీపతి ఏజెన్సీలో లీటర్ హష్ ఆయిల్ రూ.లక్షకు ఖరీదు చేసి ఇక్కడ రూ.3 లక్షల వరకు అమ్మేవాడు. హష్ ఆయిల్ కొనుగోలుదారులు దాన్ని 5, 10 ఎంఎల్ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్‌లోకి మార్చి విక్రయిస్తుంటారు. ఇతడు కూడా అలానే చేయడంతో పాటు మరింత లాభాలు పొందడానికి హష్ ఆయిల్‌ను కల్తీ చేశాడు. అక్రమమార్గంలో ఇసోప్రోపిక్ ఆల్కహాల్ ఖరీదు చేసిన ఇతగాడు దాన్ని ఆయిల్‌తో కలిపి విక్రయించాడు. దీంతో అనేకమంది వినియోగదారులు ఇతడి సరుకుకు బానిసలుగా మారిపోయేవారు.
ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు
ఆన్‌లైన్‌లో ఆహారం, కిరాణా సరుకులు విక్రయించే డుంజో, పోర్టర్, ఉబెర్, స్విగ్గీ వంటి యాప్స్ ద్వారానూ మారు పేర్లతో హష్ ఆయిల్ విక్రయించిన చరిత్ర లక్ష్మీపతికి ఉంది. ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష్మీపతి కోసం ముమ్మరంగా గాలిస్తున్న అధికారులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే కుటుంబీకులతో సంబంధాలు లేకపోవడం, తరచు మకాం మారుస్తుండటంతో లక్ష్మీపతిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment