పరీక్షల రద్దు ప్రకటన వేలాది మందికి అశనిపాతమే అయింది. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు కేరాఫ్‌గా మారిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, తదితర ప్రాంతాలు పరీక్షల రద్దు ప్రకటనతో ఉలిక్కిపడ్డాయి. అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న వేలాది మందిలో గందరగోళం నెలకొంది. ఒక్క సిటీసెంట్రల్ లైబ్రరీలోనే కాదు..అశోక్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అద్దె గదుల్లో, స్టడీరూమ్‌లలో, కోచింగ్ కేంద్రాల్లోనూ చదువుకుంటున్న లక్షలాది మంది అభ్యర్ధులు కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అశోక్‌నగర్ ప్రాంతంలోనే చిన్నవి, పెద్దవి సుమారు 30కి పైగా కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వయోపరిమితిలో చివరకు చేరుకొన్న అభ్యర్ధులు మొదలుకొని, ఈ ఏడాదే డిగ్రీ పూర్తయిన విద్యార్థుల వరకు ఒక్కో అభ్యర్థి కోచింగ్‌కు, మెటీరియల్‌కు, ఇళ్ల అద్దె, భోజనం తదితర సదుపాయాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాంవేసి ఉంటున్నారు.‘పరీక్షల రద్దుతో చదవడం మానేసి ఇంటికి వెళ్లాలా లేకపోతే మరో ప్రకటన కోసం ఎదురు చూస్తూ చదువుకోవాలా’ తేల్చుకోలేకపోతున్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పొలం అమ్ముకున్నాడు
బోధన్ సమీపంలోని కోటగిరి ప్రాంతానికి చెందిన శంకర్ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఉన్న కొద్దిపాటి భూమిలో అరఎకరం భూమిని తన చదువుల కోసమే అమ్మేశారు. మరో రూ.6 లక్షలు అప్పు చేయవలసి వచ్చింది. రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నాడు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించాడు. మెయిన్స్‌లోనూ విజయం సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు.‘ఐదు రూపాయల భోజనం తిని చదువుకుంటున్నాను. స్టడీమెటీరియల్, కోచింగ్, పరీక్షల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నా. ఇటీవల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అయినా సరే ఉద్యోగం వస్తే అంతా బాగుంటుందనే ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా అయింది.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో ఉండాలా, వద్దా తేల్చుకోలేకపోతున్నట్లు చెప్పాడు.
ఏం సమాధానం చెప్పాలి
సంగారెడ్డికి చెందిన పద్మావతి ఏడాదిన్నర కాలంగా పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఇంటికి, కుటుంబానికి దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈసారి ఎలాగైనా జాబ్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాయి. ‘ఎప్పటి వరకు ప్రిపరేషన్ పూర్తవుతుంది. పరీక్షలు ఎప్పుడు రాస్తావు, మళ్లీ ఇంటికి ఎప్పుడొస్తావు అని నాన్న అడుగుతున్నారు. కానీ ఏం సమాధానం చెప్పాలి?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రద్దు మంచిదే
‘ఒకవిధంగా రద్దు చేయడం మంచిదే. లీకేజీ వల్ల నిజాయితీగా కష్టపడే వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఒక ప్రభుత్వ సంస్థ ఇంత బలహీనంగా ఉండడమే ఆందోళన కలిగిస్తోంది’ అని మరో అభ్యర్థిని విజయలక్ష్మి పేర్కొన్నారు.
సగటున ఒక అభ్యర్థి ఖర్చులు అంచనా..
నలుగురితో కలిసి ప్రతి నెలా చెల్లించే ఇంటి అద్దె : రూ.3500
నెల భోజనం ఖర్చు : రూ.2900
స్టడీరూమ్ (ఏసీ) రూ.1700
స్టడీరూమ్ (నాన్ ఏసీ) రూ.900
గ్రూప్–1 కోచింగ్ ఫీజు రూ. 75,000
గ్రూప్–2, కోచింగ్ ఫీజు రూ.28,000
స్టడీ మెటీరియల్ రూ.15000
ఒక అభ్యర్ధికి ఏడాదికి అయ్యే ఖర్చు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు.
మరిన్ని అదనపు సదుపాయాలతో చదువుకుంటే రూ.3 లక్షలపైనే ఖర్చవుతుంది.
రద్దు అన్యాయం
నేను గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్‌కు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అంటూ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం. ఎవడో తప్పు చేస్తే నిజాయితీగా రాసిన వేలాదిమంది అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకోకుండా పరీక్ష పూర్తిగా రద్దు చేయడం అన్యాయం. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ అందరికి శిక్ష వేడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచించి మాలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నా.
– పిట్ల సరిత, డిచ్‌పల్లి, గ్రూప్–1 అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment