
బంజారాహిల్స్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకెళ్లే క్రమంలో వ్యాన్ డ్రైవర్ హోంగార్డుకు మూర్ఛ రావడంతో ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన బంజారాహిల్స్ ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి 16 మంది విద్యార్థులకు ముప్పు తప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం మధ్యాహ్నం ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్‌కు వచ్చారు.
అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వీరిని అరెస్ట్ చేసి డీసీఎంలోకి ఎక్కించి బందోబస్తులో బంజారాహిల్స్ ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డిని పంపించారు. డీసీఎం డ్రైవర్ రమేష్ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్తుండగా ఫిట్స్ రావడంతో స్టీరింగ్ వదిలేశాడు. దీంతో వ్యాన్ డివైడర్‌ను ఢీకొడుతూ వెళ్లింది. వీరందరిని తీసుకొని వెళ్తున్న కరుణాకర్‌రెడ్డి వెంటనే డ్రైవర్ సీటులోకి వెళ్లి రమేష్‌ను పక్కకు జరిపి వ్యాన్‌ను ఫుట్‌పాత్‌కు ఢీకొట్టేలా చేశాడు.
దీంతో భారీ ప్రమాదం తప్పింది. హోంగార్డు రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. వ్యాన్‌ను పక్కకు జరిపే క్రమంలో ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డికి, మరో కానిస్టేబుల్ సాయికుమార్‌కు గాయాలయ్యాయి. వీరిద్దరిని కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment