హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషనన్ పరిధిలోని ప్రజాభవనన్ ఎదురుగా ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’ చుట్టూ అల్లిన కట్టు కథల్ని పోలీసు ఉన్నతాధికారులు ఛేదిస్తున్నారు. ప్రమాద సమయంలో కారును బోన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమీర్ కుమారుడు సాహిల్ అలియాస్ రహీల్ అమీర్ నడిపినట్లు గుర్తించారు. దీనిపై తొలుత పంజగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో షకీల్ కుమారుడి పేరు లేకపోవడం, అంతకు ముందే అతను తప్పించుకున్నట్లు ప్రచారం జరగడంతో మంగళవారం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
ప్రాథమిక విచారణ నేపథ్యంలో సాహిల్ పాత్రను నిర్థారించారు. పరారీలో ఉన్న అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలోనే దుబాయ్ పారిపోయినట్లు తెలిసింది. దీంతో అతడిపై అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ) జారీ చేసినట్లు డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. పోలీసుల పాత్ర రూఢీ కావడంతో పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదం చేసి అక్కడే మంతనాలు...
సాహిల్, అతడి స్నేహితుడితో పాటు ఇద్దరు యువతులు ఆదివారం తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో (టీఎస్ 13 ఈటీ 0777) బేగంపేట వైపు నుంచి పంజగుట్ట వైపు వస్తున్నారు. ఆ సమయంలో కారు సాహిల్ నడుపుతున్నాడు. తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో వేగంగా దూసుకు వచ్చిన కారు ప్రజాభవన్‌న్ ఎదురుగా ఉన్న బారికేడ్లను ఢీ కొట్టింది. దీంతో అవి పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కారు సైతం వాటిలో ఇరుక్కుపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్న నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాహిల్ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఈ నలుగురితో పాటు అక్కడికి చేరుకున్న మరో ఐదుగురూ ప్రమాద స్థలికి సమీపంలో ఉన్నని ఓ జ్యువెలరీ దుకాణం పక్క గల్లీలో చాలాసేపు మంతనాలు జరిపారు. ఈ లోగా విషయం తెలుసుకున్న పంజగుట్ట ఇనన్‌స్పెక్టర్ దుర్గారావు ఆ ప్రాంతానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తుండగా... పక్కనే గల్లీలో మంతనాలు జరుపుతున్న వారు తారసపడ్డారు. వారిని ప్రశ్నించగా సాహిల్ అది తన వాహనామేనని, తానే నడుపుతుండగా ప్రమాదం జరిగిందని అంగీకరించారు. దీంతో కారులో ప్రయాణించిన మిగిలిన ముగ్గురి వివరాలు నమోదు చేసుకున్న ఆయన సాహిల్‌ను పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు.
కేసులో ప్రస్తావన లేకపోవడంతో...
అనంతరం సాహిల్‌ను ఓ హోంగార్డుకు అప్పగించి పక్కనే ఉన్న ట్రాఫిక్ ఠాణాలోకి తీసుకువెళ్లి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించాలని సూచించారు. అప్పటికే సాహిల్ తన వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న అబ్దుల్ ఆరిఫ్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మరో డ్రైవర్ సోహైల్‌ను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించాడు. సాహిల్ వెళ్లేటప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అబ్దుల్ ఆరిఫ్, సోహైల్‌లు సాహిల్‌ను తప్పించారు. సాహిల్, సోహైల్ అక్కడి నుంచి మరో కారులో పారిపోగా... వెంటనే అప్రమత్తమైన హోంగార్డు ఆరిఫ్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించాడు.
పంజగుట్ట ట్రాఫిక్ ఠాణాలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బి.నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందులో సాహిల్, సోహైల్‌ల పేర్లు, పరారైన ప్రస్తావన సహా ఏ అంశాన్నీ పేర్కొనకుండా ఆరిఫ్ మాత్రమే కారకుడైనట్లు ఆరోపణలు చేశారు. పోలీసులు కారును స్వాధీనం చేసుని పంజగుట్ట ఠాణాకు తరలించారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్దేశపూర్వకంగానే అధికారులు మాజీ ఎమ్మెల్యే కుమారుడైన సాహిల్‌ను తప్పించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
డీసీపీ స్వయంగా విచారణ చేయడంతో...
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా వెస్ట్‌జోన్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ను ఆదేశించారు. మంగళవారం ఉదయం రంగంలోకి దిగిన ఆయన పంజగుట్ట ఠాణాకు వచ్చి విచారణ చేపట్టారు. ఘటనాస్థలి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సైతం పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే సాహిల్ పాత్ర వెలుగులోకి వచ్చింది. అతడి సూచన మేరకే వారి ఇంట్లో పని చేసే ఆరిఫ్ ఠాణా వద్దకు వచ్చాడని, సోహైల్‌తో కలిసి అతడిని తప్పించి, తానే ప్రమాదం చేసినట్లు పోలీసులకు చెప్పాడని గుర్తించారు. ఆరిఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన అధికారులు... సాహిల్‌పై అదనపు సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు.
పరారీలో ఉన్న అతడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతడు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబం వద్దకు పారిపోయినట్లు గుర్తించి ఎల్‌ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ సెలవులో ఉండటంతో ఎస్సార్‌నగర్ ఏసీపీ వైవీ రావ్‌కు ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీసీపీ మంగళవారం పంజగుట్ట ఠాణాకు చెందిన అధికారులను తమ కార్యాలయానికి పిలిపించి సమీక్ష నిర్వహించడంతో పాటు తీవ్రంగా మందలించారు. ఓ దశలో పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు లో బీపీతో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. చివరకు కేసు నమోదు తదితర అంశాల్లో ఆయన పాత్ర తేలడంతో కొత్వాల్‌కు నివేదించారు. ఆయన ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
సాహిల్ కేసులో 17 సెక్షన్ల కింద ఆరోపణలు...
కారు ప్రమాద ఘటనలో సూత్రధారిగా ఉన్న సాహిల్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానానికి సమాచారం ఇచ్చిన పంజగుట్ట పోలీసులు అతడి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ప్రాథమికంగా ఆదివారం తెల్లవారుజామున పంజగుట్ట పోలీసులు ఆరిఫ్‌పై (ఐపీసీ), మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్), ప్రజా ఆస్తుల పరిరక్షణ చట్టంల్లోని (పీడీపీపీ) మూడు సెక్షన్ల (274, 189, 3) కేసు నమోదు చేశారు. అయితే ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో కేవలం పీడీపీపీలోని సెక్షన్ మినహాయిస్తే మిగిలిన రెండూ సరైనవి ప్రయోగించలేదని గుర్తించారు.
దీంతో ఆరిఫ్ రిమాండ్ రిపోర్టులో సాహిల్ పేరుతో పాటు ఈ ఐపీసీ, ఎంవీ యాక్ట్‌ల్లోని మరో 14 సెక్షన్లను జోడించారు. తొలుత నమోదు చేసిన ఐపీసీలోని 274, ఎంవీ యాక్ట్‌లోని 189 సెక్షన్లు తొలగించారు. వీటికి బదులుగా వీరిద్దరిపై పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్ 3తో పాటు ఐపీసీలోని 308, 419, 279, 201, 203, 212, 213, 214, 182, 109, 34తో పాటు ఎంవీ యాక్ట్‌లోని 184, 185, 187, 188, 205లను జోడించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సాహిల్‌తో పాటు అతడి తండ్రి షకీల్ పేర్లనూ నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment