మెగా టూరిస్ట్‌ హబ్‌గా ట్యాంక్‌ బండ్‌– నెక్లెస్‌ రోడ్‌ | - | Sakshi
Sakshi News home page

మెగా టూరిస్ట్‌ హబ్‌గా ట్యాంక్‌ బండ్‌– నెక్లెస్‌ రోడ్‌

Published Wed, Apr 12 2023 7:34 AM | Last Updated on Wed, Apr 12 2023 10:45 AM

- - Sakshi

చార్మినార్‌.. గోల్కొండ కోట.. సాలార్‌జంగ్‌ మ్యూజియం.. సెవెన్‌ టూంబ్స్‌ (కుతుబ్‌షాహీ సమాధులు).. జూపార్క్‌.. చౌమహల్లా ప్యాలెస్‌.. ఇవే ఒకప్పుడు హైదరాబాద్‌ పర్యాటక చిరునామాలు. కాలక్రమేణా వీటితో పాటు అక్కడక్కడా మరికొన్ని ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఏకంగా 10 కిలోమీటర్ల దూరంలోనే సుమారు 20కిపైగా ప్రదేశాలతో మెగా టూరిస్ట్‌ సర్కిల్‌గా రూపుదిద్దుకుంటోంది. ఒక్క రోజులోనే ఇవన్నీ చుట్టేసి రావొచ్చు. ఎలా వెళ్లినా తక్కువ బడ్జెట్‌తో ఒక రోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో హాయిగా గడిపేయొచ్చు. పర్యాటకుల కోలాహలానికి చిరునామాగా మారిన ట్యాంక్‌ బండ్‌ – నెక్లెస్‌ రోడ్‌పై ఓ లుక్కేద్దాం! – సాక్షి, సిటీడెస్క్‌

ట్యాంక్‌బండ్‌, బుద్ధ విగ్రహం, ఇందిరా పార్కు, స్నో వరల్డ్‌, మరో రెండురోజుల్లో ఆవిష్కరణ కానున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, అద్భుతంగా ఆవిష్కృతం కాబోతున్న రాష్ట్ర నూతన సచివాలయం, ప్రారంభానికి సిద్ధమైన అమరవీరుల స్మారకం, లుంబినీ పార్కు,, ఎన్టీఆర్‌ గార్డెన్‌, ప్రసాద్‌ ఐమాక్స్‌, బిర్లా మందిర్‌, బిర్లా ప్లానెటోరియం, జలవిహార్‌, థ్రిల్‌ సిటీ, ఈట్‌ స్ట్రీట్‌, సంజీవయ్య పార్కు, పీవీ జ్ఞాన భూమి, జైపాల్‌రెడ్డి స్మృతి వనం, ఇందిరా పార్కు.. ఇలా సుమారు 20కి పైగా ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. ఇవన్నీ కేవలం 10కి.మీ సర్కిల్‌లో ఉండడం విశేషం. మరోవైపు ఇటీవల నిర్వహించిన ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ ఈవెంట్‌ ట్యాంక్‌బండ్‌ ఖ్యాతిని ఖండాంతరాలకు పరిచయం చేసింది.

కొత్తందాల సమ్మేళనం
ఎప్పుడూ చూసే ట్యాంక్‌బండే కదా అనుకుంటే పొరపడినట్లే. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. కొత్తందాలతో కళకళలాడుతోంది. మిరుమిట్లుగొలిపే వెలుగుల్లో తథాగతుడు కనువిందు చేస్తున్నాడు. సండే ఫన్‌డే రోజున జరిగే సంగీత కార్యక్రమాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన నీటి ఫౌంటేన్లు జిగేల్‌మంటున్నాయి. లగ్జరీ బోట్లలో వ్యక్తిగత పార్టీలు, రాత్రి వేళల్లో బర్త్‌డే పార్టీలకు కేరాఫ్‌గా మారింది. ఇక ఎన్టీఆర్‌ గార్డెన్‌లో అరుదైన బొన్సాయ్‌ మొక్కలు, ఆర్టిఫీషియల్‌ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్‌ హౌస్‌, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్‌ కార్లలో స్నాక్స్‌, అత్యంత ఎత్తులో నెక్లెస్‌ రోడ్‌ అందాలను చూపించే జెయింట్‌ వీల్‌, అండర్‌ గ్రౌండ్‌లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్‌ చేసే త్రీడీ షో.. ఇవన్నీ ఇప్పుడు ట్యాంక్‌ బండ్‌కు సమ్‌థింగ్‌ స్పెషల్‌. ప్రసాద్‌ ఐమాక్స్‌లో సినిమా, షాపింగ్‌, గేమింగ్‌, ఈటింగ్‌, జల్‌ విహార్‌లో రెయిన్‌ డ్యాన్స్‌, వాటర్‌ గేమ్స్‌తో ఫుల్‌ ఎంజాయ్‌ ఉంటుంది. థ్రిల్‌ సిటీలో ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్‌ అనుభూతిని పంచుతుంది. సంజీవయ్య పార్క్‌లో అనేక రంగులతో అలరించే రోస్‌ గార్డెన్‌, బటర్‌ఫ్లై పార్క్‌, అతిపెద్ద జాతీయ జెండా, డాగ్‌ పార్క్‌, సైక్లింగ్‌ క్లబ్‌ ఇలా ఎన్నో.. మరెన్నో విశేషాలకు వేదిక అయ్యింది.

నీరా కేఫ్‌
హుస్సేన్‌సాగర్‌ తీరం చెంత నెక్లెస్‌ రోడ్‌లో మరో కొత్త పర్యాటక కేంద్రం నీరా కేఫ్‌ సిద్ధమైంది. అతి త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. తెలంగాణ రుచులందించే స్టాళ్లతోపాటు కల్లుగీత వృత్తికి అద్దం పట్టేలా దీన్ని నిర్మించారు. పై అంతస్తులో ఒక సమావేశ మందిరం, రెస్టారెంట్‌ ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం లుంబినీ పార్కు వద్ద ఉన్న బోటింగ్‌ పాయింట్‌కు తోడుగా నీరా కేఫ్‌ వెనుకభాగంలో మరో బోటింగ్‌ పాయింట్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. నెక్లెస్‌రోడ్‌లో విహరించేవారు లుంబినీ పార్కు బోటు యూనిట్‌ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. సాగర్‌కు దక్షిణం వైపు నుంచి కూడా ప్రయాణించడానికి వీలు కల్పించినట్లయింది.

ప్రతిరోజూ వెళ్లాలనిపిస్తోంది
15 ఏళ్ల క్రితం సిటీకి వచ్చాను. నేడు ఎంతగానో మారింది. ముంబై, బెంగళూరు నగరాల కంటే ఎక్కువగా పర్యాటక రంగం దూసుకెళుతోంది. ఒకప్పుడు ఈవెనింగ్‌ టైంలో ట్యాంక్‌బండ్‌కు వెళ్లి రెండు, మూడు గంటల పాటు ఎంజాయ్‌ చేసేవాడిని. లాస్ట్‌ వన్‌ ఇయర్‌లో ట్యాంక్‌బండ్‌ ఏరియాలో జరిగిన డెవలప్‌మెంట్‌కు వీకెండే కాదు ప్రతిరోజూ వెళ్లాలనిపిస్తోంది. సరికొత్తగా కనిపిస్తోంది,

– చక్రవర్తి, ఐటీ ఉద్యోగి, రాంనగర్‌

బడ్జెట్‌ ఫ్రెండ్లీ సిటీ
హైదరాబాద్‌ అనేది బడ్జెట్‌ ఫ్రెండ్లీ సిటీ . ఇతర నగరాల్లో అయితే పర్యాటక ప్రాంతాలు ఒకే దగ్గర ఉండవు. అదే మన సిటీలో ఒక్క ట్యాంక్‌ బండ్‌కు వస్తే చాలు బోలెడన్ని ప్లేస్‌లు. ఒక్క రోజులో అన్నీ చుట్టేసి రావచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే ప్రాంతాలే ఎక్కువ. ఫుల్‌ ఎంజాయ్‌ చేయొచ్చు. పైగా తక్కువ ఖర్చులో వీటన్నింటినీ ఒకేరోజులో చూడొచ్చు.
– శివాని సింగ్‌, ట్రావెలర్‌, బంజారాహిల్స్‌

ఇవి చేస్తే ఇంకా మేలు
● పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా రీఫ్రెష్‌మెంట్‌ సౌకర్యాలపై జీహెచ్‌ఎంసీ, టూరిజం విభాగం దృష్టి సారించాలి. ప్రధానంగా టాయిలెట్ల సంఖ్య పెంచాలి.

● మినీ మొబైల్‌ వ్యాన్‌లు, షటిల్‌ సర్వీస్‌లు పెడితే బావుంటుంది. రోజంతా తిరిగేందుకు ఆర్టీసీ తరహా సింగిల్‌ డే పాస్‌లు ఉంటే మేలు.

● మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు ,లాన్లలో కూర్చుకునేందుకు స్ట్రీట్‌ ఫర్నీచర్‌ అవసరం (ట్యాంక్‌బండ్‌, పీవీ మార్గ్‌ మినహా మరెక్కడా ఎక్కడా లేవు).

● షీ–టీంలను పెంచి, పోకిరీలు, ఆకతాయిల వేధింపులపై మరింత దృష్టి సారించాలి.

● రద్దీ వేళల్లో సందర్శకులతో ట్రాఫిక్‌ జాం అవుతోంది. వీకెండ్స్‌లో ట్యాంక్‌ బండ్‌ మాదిరిగానే హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని నో వెహికిల్స్‌ జోన్‌గా మార్చాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement