కలల గూడు కళ్లముందే కూలిపోయింది. ఇంట్లో వాళ్లందరినీ ఈడ్చివేసి.. తట్టాబుట్టా, వంట సామాను అంతటినీ బయటికి పడేసి గెంటేస్తుంటే.. రక్తాన్ని చెమటగా చేసి కట్టుకున్న పొదరిల్లు నేలమట్టం చేస్తుంటే ఆ బడుగుల గుండెలు అవిసిపోయాయి. కన్నీళ్లు వెల్లువలా ఉబికివచ్చాయి. అధికారులను కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు.
పైసా పైసా కూడబెట్టి నిర్మించుకున్న తమ పేద సౌధాన్ని కూకటివేళ్లతో కూలి్చవేస్తుంటే ఆ జాలి కళ్లు భోరుమన్నాయి. నిస్సహాయతే వారి తోడయ్యింది. పలకరించి పరామర్శించేవారే లేక దేవేందర్‌నగర్ పేద బస్తీ ఒంటరైంది. దిక్కు తోచని స్థితిలో దిక్కులు పిక్కటిల్లే రోదనలతో ఆ ప్రాంతమంతా కన్నీటిపర్యంతమైంది.
కాయా కష్టం చేసుకుని పోగు చేసుకున్న డబ్బులతో కబ్జాదారుల వద్ద ప్రభుత్వ స్థలాన్ని కొంటే ఆదిలోనే కట్టడి చేయాల్సిన అధికారులు.. పేదల ఆవాసాలపై ప్రతాపం చూపించడం తగదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాజులరామారం పరిసర ప్రాంతాల్లో వెలసిన సుమారు 2500 అక్రమ గృహాల్లో 2000 మంది వరకు నివాసం ఉంటున్నారు. మంగళవారం సుమారు 400 కుటుంబాలను రోడ్డు పాలు చేయగా.. మిగిలినవారు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు.
పిల్లాపాపలతో రోడ్డున పడ్డ వీరి పరిస్థితిపై ఏ ఒక్క రాజకీయ నాయకుడూ స్పందించకపోవడం, ఆ ప్రాంతాన్ని సందర్శించకపోవడంపై బాధితులు తీవ్ర విమర్శలు చేశారు. కాగా.. అధికార పారీ్టకి చెందిన పలువురిపై ఇప్పటికే భూకబ్జా కేసులు నమోదు కాగా కూలి్చవేతల సమయంలో పత్తా లేకుండా పోయారు.. అంతేకాకుండా అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు రావడంతో పేదలు ఉంటున్న ఇళ్లపై ప్రతాపం చూపడం.. వారిని రోడ్డున పడేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భూకబ్జాదారులు, రెవెన్యూ అధికారుల చేతుల్లో పేద ప్రజలే సమిధలయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆదిలోనే కట్టడి చేసి ఉంటే..
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలను మొదట్లోనే అడ్డుకుంటే అమాయక ప్రజలు మోసపోయే ఆస్కారం ఉండేది కాదు. గత మూడేళ్లుగా కబ్జాదారులతో కొందరు అధికారులు ఒక్కో ప్లాట్‌కు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు.
మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ నివేదిక ద్వారా విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులకు రూ.75 కోట్లు ముడుపుల రూపంలో ముట్టగా.. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.375 చేతులు మారినట్లు వదంతులు రావడంతో అందరి దృష్టి కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ భూములపై పడింది.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఉత్తర్వులతో మంగళవారం ఉదయం నుంచే కూల్చివేతలు చేపట్టిన అధికారులకు అక్కడ కబ్జాదారుల చేతుల్లో మోసపోయి ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో వాగ్వాదం చోటుచేసుకుంది.
భూ కబ్జాల నివారణలో ఘోర వైఫల్యం..
ప్రభుత్వ స్థలాలను కాపాడే విషయంలో కుత్బుల్లాపూర్ చరిత్రలో ఇంత ఘోరమైన అధికారుల వైఫల్యం ఎప్పుడూ లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్ మండలం డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఉండేవారు.. అప్పట్లో ఈ భూముల రక్షణకు అధికారులు తీవ్రంగా కృషి చేశారు. అప్పటి కలెక్టర్ రఘునందన్ రావు ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ రంజిత్ కుమార్ షైనీ పెద్ద ఎత్తున అప్పట్లో ఆక్రమణలను తొలగించారు.
గడచిన మూడేళ్లలో ఆక్రమణలను చూస్తుంటే ఇంత అధ్వానమైన పరిస్థితి కుత్బుల్లాపూర్ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఇప్పటికే ఆర్‌ఐ పరమేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
పేద బడుగు వర్గాలపై ప్రతాపం చూపిన అధికారులు వారికి నష్ట నివారణ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇక్కడ కబ్జాదారులకు రూ.లక్షల్లో ముట్టజెప్పి సుమారు రెండు లక్షల రూపాయలతో గదులు నిర్మించుకుంటే ప్రతి ఒకరికి సుమారు 15 లక్షల రూపాయల పైమాటే ఖర్చవుతుంది.. డబ్బులు తీసుకున్న కబ్జాదారులు, వీటిని ప్రోత్సహించిన అధికారులు సురక్షితంగా ఉండగా.. అమాయకులు మాత్రం రోడ్డున పడ్డారు.. వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.
భూమి పట్టా వస్తుందన్నారు..
మాది నిజామాబాద్ జిల్లా. కొన్నేళ్ల క్రితమే నగరానికి వలస వచ్చాం. నా భర్త తాపీ మేసీ్త్ర. ఇద్దరం కలిసి కష్టపడితేనే కుటుంబం నడుస్తుంది. పైసా పైసా కూడబెట్టి ప్లాటు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. కొన్ని రోజులపాటు బాగానే ఉన్నాం. భూమి పట్టా కూడా వస్తుందని చెప్పారు. ఇప్పుడే ఈ సార్లు వచ్చి మా ఇంటిని కూల్చివేశారు. ఇద్దరు చిన్నపిల్లలతో ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడ.. ఎలా బతికేది?
– అనిత, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment