
హైదరాబాద్: సరదా అభిరుచి వారిని గుట్టలెక్కించింది. సీరియస్ వ్యాపకంగా మారి సుదూరాల్లోని శిఖరాల్ని అధిరోహింపజేసింది. నగరానికి చెందిన ముగ్గురు టీనేజర్లు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పూర్తి చేసుకున్నారు. తమ బృందంతో కలిసి ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్న వీరు మరో 2 రోజుల్లో నగరానికి చేరుకోనున్నారు. నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న హాసికారెడ్డి (15), ప్రస్తుతం ఐఐటీ జేఈఈకి ప్రిపేరవుతోంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌లో చదువుతున్న సృజన్ తిమ్మిరెడ్డి సాట్‌కి ప్రిపేర్ అవుతున్నాడు.
ఫిట్ జీలో 12వ తరగతి చదువుతున్న కృషి గుప్తా (16).. ఐఐటీ జేఈఈకి ప్రిపేర్ అవుతోంది. వ్యక్తిగతంగా వీరికి తమ కెరీర్ లక్ష్యాలు వేరైనా.. అభిరుచులు కలిశాయి. విభిన్న రకాల హాబీలతో పాటు చదువులోనూ రాణిస్తున్న వీరంతా.. కొన్ని నెలలుగా ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి పెంచుకుని ఫ్రెండ్స్‌గా మారారు. నగరం చుట్టుపక్కల ఉన్న కొండల్ని గుట్టల్ని ఎక్కడం అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలోనే వీరికి మరికొందరు పెద్దలూ జత కలిశారు. వయసులకు అతీతంగా ఆటపాటలతో పాటు అడ్వెంచర్ ట్రెక్స్‌ని ఆస్వాదిస్తున్నారు.
వైనాట్ ఎవరెస్ట్?
చిన్నా చితకా కొండలు గుట్టలు ఏల? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే ఆలోచన ఈ బృందానికి వచ్చింది. అదే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పూర్తి చేయాలని. ఒక్కసారి అత్యంత ఎత్తయిన శిఖరారోహణకు ప్రాథమిక దశను పూర్తి చేస్తే.. ఇక అది ఇచ్చే ఆత్మవిశ్వాసం జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కునేందుకు అవసరమైన సత్తా ఇస్తుందని భావించారు. అందరూ కలిసి చర్చించుకున్నారు. మిగిలిన అందరూ వయసులో పెద్దవాళ్లు కాబట్టి పర్లేదు కానీ టీనేజర్లయిన ముగ్గురి విషయంలో కాస్త చర్చ జరిగింది. తాము సైతం అని ముగ్గురూ కృత నిశ్చయం వ్యక్తం చేయడం, ముగ్గురి తండ్రులూ బృందంలో ఉండడంతో గత కొన్ని రోజుల పాటు తమకు తాముగానే సాధన చేసి వీరంతా సిద్ధమయ్యారు.
వేల కి.మీ ఎత్తులో...
ఈ నెల 13న వీరంతా నగరాన్ని వదిలి లక్ష్యసాధన దిశగా పయనమయ్యారు. నేపాల్ చేరుకుని అక్కడి గైడ్స్ సహకారంతో.. పూర్తి సన్నద్ధతతో ముందడుగు వేశారు. ఎవరెస్ట్ పర్వతారోహణలో ప్రాథమిక దశ అయిన బేస్ క్యాంప్ పూర్తి చేయడం కోసం వీరు ఎక్కాల్సింది 5364 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం.. సుమారు 65 కి.మీల ఎత్తు పల్లాలతో శిఖరాల మీదుగా నడక ఉంటుంది. ఇందులో భాగంగా 8 రోజుల పాటు సాగిన వీరి సాహస యాత్ర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, అవాంతరాలు తప్ప మరే అడ్డంకులూ లేకుండా గత ఆదివారం ముగిసింది. మరో 2 రోజుల్లో ఈ బృందం నగరానికి చేరుకోనుంది. నిర్విరామంగా.. 0– 9 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. 3.5 కి.మీ మేర మంచు దుప్పట్లో 12 గంటల పాటు శిఖరాలపై నడవాల్సి రావడంతో చివరలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని, చెప్పుకోదగ్గ ఇబ్బందులేవీ ఎదురుకాలేదని బృందంలో సభ్యుడైన ప్రశాంత్‌రెడ్డి ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. కొంత కష్టతరమైనప్పటికీ ఈ తరహా సాహసాలతో టీనేజర్లకు ఒనగూరే ఆత్మవిశ్వాసం విలువ లెక్కకట్టలేనిదని ఆయన చెప్పారు.

Comments
Please login to add a commentAdd a comment