నగరం పరిధిలో ఇటీవల అదృశ్యం కేసులు ఎక్కువ అవుతున్నాయి. సిటీ నలుమూలలా ఏదో ఒక చోట బాలిక లేదా బాలుడు లేదా యువతీయువకులు అదృశ్యమయ్యారని ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. వీరంతా ఏమయ్యారో తెలియక బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఇలా నాలుగు పోలీస్ స్టేషన్లలో అదృశ్యం ఫిర్యాదులు అందాయి. – సాక్షి, నెట్‌వర్క్
డిగ్రీ విద్యార్ధిని అదృశ్యం
నల్లకుంట: డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రమాదేవి తెలిపిన వివరాల మేరకు..సిద్దిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ తుమ్మ యాదగిరి కుమార్తె శ్రావ్య (21)కు ఇటీవలే వివాహమైంది. కాగా 2021లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చుదువుతూ నల్లకుంట శంకరమఠం సమీపంలోని హాస్టల్‌లో ఉంటుంది.
ఇటీవల ఇంటికి వెళ్లిన ఆ యువతి ఈ నెల 15న హాస్టల్‌కు వచ్చింది. ఈ క్రమంలో 17న సాయంత్రం తండ్రి యాదగిరి కుమార్తెను చూడడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. హాస్టల్ నిర్వాహకులను విచారించగా శ్రావ్య ఈ నెల 16న సాయంత్రం 8 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారిని విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన యాదగిరి తమ కుమార్తె కనిపించడంలేదంటూ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్‌లో ఇద్దరు పిల్లలు..
మేడ్చల్ రూరల్: నిత్యం ఇంట్లో ఉండే అన్నా చెల్లెలు ఇద్దరు తండ్రి పనికి వెళ్లొచ్చేసరికి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బిహార్ రాష్ట్రానికి చెందిన బ్రహ్మదేశ్ పాశ్వాన్–బబ్లీదేవి దంపతులు మేడ్చల్ పట్టణానికి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారుడు అజయ్‌కుమార్ (7), ప్రతిభ (5)లు సంతానం. కాగా మూడేళ్ల క్రితం దంపతులు విడాకులు తీసుకోవడంతో పిల్లలు తండ్రి వద్ద ఉంటున్నారు.
నిత్యం పిల్లలకు భోజనం తినిపించి ఇంటి వద్దే ఉంచి తండ్రి సెంట్రింగ్ పనికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన రోజులాగే ఉదయం 7 గంటలకు పనికి వెళ్లిన బ్రహ్మదేవ్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చేసరికి పిల్లలు అజయ్‌కుమార్, ప్రతిభ ఇంట్లో కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మేడ్చల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మనుమడిని చూసేందుకొచ్చిన వృద్ధురాలు..
వెంగళరావునగర్: నగరంలో నివసిస్తున్న మనుమడిని చూడటానికి వచ్చిన ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఒంగోలులో నివసించే డి.అచ్చమ్మ (70) వెంగళరావునగర్ డివిజన్ వీడియోగల్లీలో నివసించే మనుమడి ఇంటికి మూడు రోజుల కిందట వచ్చింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన అచ్చమ్మ తిరిగి రాలేదు. మనుమడు వెంకటేశ్వర్లు బంధుమిత్రులకు ఫోన్ల ద్వారా సమాచారం తెలియజేసి విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదివారం మధురానగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అచ్చమ్మ నలుపు రంగు ఉండి. దాదాపు 4.8 అడుగులు ఎత్తు ఉంటుందని, కొద్దిగా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనుమడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫిలింనగర్‌లో యువతి...
ఫిలింనగర్: అనుమానాదస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీ నగర్ బస్తీకి చెందిన అంకిత(19) డెంటల్ హాస్పిటల్లో పనిచేస్తున్నది. ఎప్పటిలాగే ఆదివారం డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. తండ్రి ఊషన్న అన్ని ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో తన కూతురు కనిపించడంలేదు అని ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment