హైదరాబాద్: మూసీ నదిపై ఇక రయ్‌మంటూ వాహనాలు పరుగులు తీయనున్నాయి. ట్రాఫిక్ చిక్కులకు చక్కటి పరిష్కారం లభించనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలకు ఆటంకంగా ఉన్న మూసీ నదిపైన వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూసీ, ఈసీ నదులపైన మొత్తం 14 చోట్ల బ్రిడ్జిలను నిర్మించనున్నారు. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ వంతెనల నిర్మాణంలో భాగంగా 9 చోట్ల హెచ్‌ఆర్‌డీసీఎల్, జీహెచ్‌ఎంసీ, కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) సంస్థలు పనులు చేపట్టనుండగా, మరో 5 ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనుంది.
ఇందుకోసం తాజాగా ఆసక్తి గల నిర్మాణ సంస్థల నుంచి టెండర్లను సైతం ఆహ్వానించింది. హైదరాబాద్ మహానగరం అన్ని వైపులా అనూహ్యంగా విస్తరిస్తోంది. అందుకనుగుణంగా రోడ్డు నెట్‌వర్క్ విస్తరణకు నోచకపోవడంతో అనేక చోట్ల వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఇరుకై న రహదారులు ఆటంకంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రహదారుల విస్తరణ, వివిధ ప్రాంతాల మధ్య రోడ్ నెట్‌వర్క్ అభివృద్ధిపైన సీరియస్‌గా దృష్టి సారించింది.
ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఈజీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల విస్తరణ చేపట్టింది. హెచ్‌ఆర్‌డీసీఎల్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లింక్‌రోడ్లను అభివృద్ధి చేసింది. ప్రధాన రహదారులను కలిపే ఈ లింక్ రోడ్ల వల్ల వందలాది కాలనీలు దగ్గరయ్యాయి. ఇదే క్రమంలో మూసీపైన 14 చోట్ల బ్రిడ్జిల నిర్మించడం ద్వారా నిరాటంకమైన రోడ్డు నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది.
ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు..
పడమటి వైపున నార్సింగి నుంచి ఇటు తూర్పు వైపున గౌరెల్లి వరకు సుమారు 48 కిలోమీటర్ల మార్గంలో మూసీ ప్రవహిస్తోంది. ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆ చివరి నుంచి ఈ చివర వరకు మూసీ పరవళ్లు తొక్కుతోంది. పాత ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) పరిధిలో ప్రజలు మూసీ నది ఉత్తరం నుంచి దక్షిణం వరకు వెళ్లేందుకు అవసరమైన చోట్ల వంతెనలు అందుబాటులో ఉన్నాయి. ఇంచుమించు ప్రతి 2 నుంచి 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంతెనల నిర్మాణం చేపట్టారు.
కానీ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం ఔటర్‌ను దాటుకొని విస్తరించింది. దీంతో నగర శివారు ప్రాంతాల్లో మూసీకి ఉత్తర, దక్షిణ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కోచోట కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు అదనంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం(సీటీఎస్) ప్రకారం మూసీ నదిని దాటే ప్రయాణికుల సంఖ్య 2031 నాటికి 36 లక్షల ట్రిప్పుల నుంచి 60 లక్షల ట్రిప్పులకు పెరుగనున్నట్లు అంచనా.
శివార్ల వైపు నగరం శరవేగంగా విస్తరిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తేలిగ్గా రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం కోర్ సిటీలో ఉన్నట్లుగానే కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున వంతెనలు అందుబాటులో ఉండేవిధంగా సుమారు రూ.545 కోట్ల అంచనాలతో 14 చోట్ల నిర్మించనున్నారు.ఒక్కోటి 200 మీటర్ల చొప్పున ఉంటుంది.
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఐదు వంతెనలు
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ, ఈసీ నదుల పైన ఐదు చోట్ల వంతెనల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. ఆసక్తిగల నిర్మాణ సంస్థలు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దరఖాస్తులను అందజేయవచ్చు. ఈ ప్రాజెక్టుపైన ఈ నెల 18వ తేదీన హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగంలో ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
పడమటి వైపు మంచిరేవుల వద్ద ఒకటి, బుద్వేల్ వద్ద రెండు వంతెనలతో పాటు ఇటు తూర్పు వైపున ఉప్పల్ భగాయత్‌లో ఒకటి, ప్రతాప్‌సింగారం వద్ద మరొకటి చొప్పున మొత్తం 5 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఐదు వంతెనల నిర్మాణానికి రూ.130 కోట్ల వరకు నిర్మాణ వ్యయంగా అంచనా వేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment