హెచ్‌ఎండీఏలో రెండో రోజూ ఫైళ్ల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏలో రెండో రోజూ ఫైళ్ల తనిఖీలు

Published Wed, Feb 7 2024 5:58 AM | Last Updated on Wed, Feb 7 2024 7:26 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏలో రెండో రోజూ ఏసీబీ దాడులు హడలెత్తించాయి. అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ కార్యాలయానికి మంగళవారం ఉదయమే చేరుకున్న ఏసీబీ అధికారులు వివిధ జోన్‌లకు చెందిన ఫైళ్లను తెప్పించుకొని తనిఖీ చేశారు. హెచ్‌ఎండీఏ కార్యాలయంలోని ఏడో అంతస్తులో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలను కొనసాగించారు. ఫైళ్లను పరిశీలించే క్రమంలో హెచ్‌ఎండీఏలోని ఘట్‌కేసర్‌, శంషాబాద్‌, శంకర్‌పల్లి జోన్‌లకు చెందిన ప్లానింగ్‌ అధికారులు, ఏపీఓలను తమ వద్దకు రప్పించుకొని పలు అనుమతులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు పని చేసిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ హయాంలో ఇచ్చిన హైరైజ్‌ భవనాల అనుమతులపై ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

ఆ జోన్‌ల ఫైళ్లపైనే నజర్‌..
► వివిధ జోన్‌లలో భారీ లేఅవుట్‌లకు అనుమతుల్విడంలో చోటుచేసుకున్న అవకతవకలపైనా ఏసీబీ ఫోకస్‌ పెట్టింది. మరోవైపు ఏసీబీ సోదాల నేపథ్యంలో హెచ్‌ఎండీఏ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగో అంతస్తు నుంచి ఏడో అంతస్తుకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఒకవైపు ఏసీబీ అధికారులు అడిగిన సమాచారాన్ని, ఫైళ్లను అందజేయడంతో పాటు సందేహాలను నివృత్తి చేసేందుకు ప్లానింగ్‌ అధికారులు పరుగులు పెట్టారు. మొదటి రోజు సుమారు 26 మంది ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, మంగళవారం రెండో రోజు 10 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు శంషాబాద్‌, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్‌ జోన్‌లకు సంబంధించిన ఫైళ్లనే తనిఖీ చేశారు. శివబాలకృష్ణ హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ముందస్తు సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు...ఆ సమాచారానికి సంబంధించిన వివరాలను మరింత లోతుగా సేకరించేందుకే ఫైళ్లను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఏసీబీ దాడులు కొనసాగిన సమయంలో బయటివారు ఏడో అంతస్తులోకి రాకుండా తలుపులు మూసివేశారు.

బడా సంస్థల అనుమతులే టార్గెట్‌..

► నిర్మాణరంగంలో బడా సంస్థలుగా కొనసాగుతున్న కొన్నింటికి శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హైరైజ్‌ భవనాలకు అనుమతులనిచ్చే క్రమంలో కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులను ఇచ్చారు. ఈ క్రమంలో మాస్టర్‌ప్లాన్‌ నిబంధనలను కూడా తుంగలో తొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలు అనుమతులను ఇవ్వడంలో ప్రస్తుతం సెలవులో ఉన్న ఒక ఏపీఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ గుర్తించింది. మరో ఇద్దరు ప్లానింగ్‌ అధికారులు కూడా శివ బాలకృష్ణకు అన్ని విధాలా అనుకూలంగా ఉండి అక్రమ అనుమతుల్లో ప్రధాన భాగస్వాములుగా నిలిచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

► తాజా సోదాల్లో ఈ మూడు జోన్‌లకు సంబంధించిన ఫైళ్లనే ప్రధానంగా విచారిస్తున్నారు. హైదరాబాద్‌ గ్రోత్‌కాడార్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. కొన్ని చోట్ల సమాంతర రోడ్ల కోసం కేటాయించిన భూములను ఆక్రమించుకోగా.. మరికొన్ని చోట్ల కన్జర్వేషన్‌ జోన్‌లలో ఉన్న భూములకు సైతం ఇష్టారాజ్యంగా అనుమతులను ఇచ్చినట్లు సమాచారం. తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలను సైతం పక్కన పెట్టి చెరువుల్లో భారీ కట్టడాలకు అనుమతులనిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

► శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో పార్కులు, ఎమ్యూనిటీస్‌ కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమించి భవనాలను నిర్మించేందుకు అప్పట్లో హెచ్‌ఎండీఏ అనుమతులను ఇచ్చిందని బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు శివబాలకృష్ణను తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న అధికారులు, మరోవైపు ఏసీబీ కార్యాలయానికి వచ్చే బాధితుల నుంచి కూడా ఫిర్యా దులను స్వీకరిస్తున్నారు. ఇలా శివబాలకృష్ణ నుంచి సేకరించిన వివరాలు, బాధితుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని అందుకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. బుధవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అంతా టెన్షన్‌.. టెన్షన్‌..
మంగళవారం సాయంత్రం వరకు ఫైళ్లను పరిశీలించిన ఏసీబీ అధికారులు కొన్నింటిని తమతో పాటు తీసుకెళ్లినట్లు తెలిసింది. కొన్ని బడా సంస్థలకు చెందిన అనుమతులపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించి తమ సోదాలు కొనసాగించారు. దీంతో శివబాలకృష్ణ ఆదేశాల మేరకు అప్పట్లో ఆయా బడా సంస్థలకు అన్ని విధాలుగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ఆ ఫైళ్లు, ఆ అనుమతులు తమ మెడకు చుట్టుకుంటాయేమోననే భయాందోళనకు గురవుతున్నారు. శివబాలకృష్ణకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన ఒక ఏపీఓ ఇప్పటికే సెలవులో వెళ్లిపోవడం ఏసీబీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement