
హైదరాబాద్: జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్.. హరిత మెట్రో కారిడార్. ఈ రూట్‌లో రైలెక్కాలంటే కనీసం 12 నుంచి 15 నిమిషాల వరకు పడిగాపులు కాయాల్సిందే. నాగోల్– రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్ కారిడార్‌లలో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున వందల కొద్దీ సర్వీసులు పరుగులు తీస్తుండగా... 9 మెట్రో స్టేషన్‌లతో, నగరం ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే జేబీఎస్– ఎంజీబీఎస్ లైన్‌లో మాత్రం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సివస్తోంది. దీంతో ఆ రూట్‌లో మెట్రో సేవలను వినియోగించుకొనేందుకు సైతం చాలామంది వెనుకడుగు వేస్తుండటం గమనార్హం.
వేచి చూడలేక..
► విద్యార్థులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు తదితర రంగాలకు చెందిన ప్రయాణికులకు జేబీఎస్– ఎంజీబీఎస్ కారిడార్ అందుబాటులో ఉంది. కానీ సమయపాలన సరిగా లేకపోవడంతో చాలా మంది మెట్రోను వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఏ స్టేషన్‌లో చూసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులు పల్చగానే కనిపిస్తున్నారు. ‘స్టేషన్‌కు వెళ్లే వరకు మెట్రో అందుబాటులో ఉందంటే సంతోషం. ఒకసారి ట్రైన్ వెళ్లిపోయిందంటే మరోదాని కోసం కనీసం 15 నిమిషాలు ఎదురు చూడాల్సి వస్తోంది. అందుకే మెట్రో స్టేషన్‌కు వెళ్లాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నాం’ అని కార్ఖానాకు చెందిన ఆనంద్ తెలిపారు. మెట్రోలో వెళ్లాలని ఉన్నప్పటికీ సికింద్రాబాద్ నుంచి కోఠీకి వెళ్లేందుకు తాను ఆర్టీసీ బస్సులు లేదా ఆటోలను వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.
► ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే ఒక్క రాయదుర్గం స్టేషన్‌లోనే రోజుకు 32 వేల మంది ప్రయాణం చేస్తుండగా, జేబీఎస్–మెట్రో కారిడార్‌లోని 9 స్టేషన్‌లలో కలిపి రోజుకు కేవలం 25000 మంది మాత్రమే ప్రయాణం చేయడం గమనార్హం. ప్రతి రోజు 5.10 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. నాగోల్–రాయదుర్గం రూట్‌లో 2.25 లక్షలు, ఎల్‌బీనగర్–మియాపూర్ రూట్‌లో 2.60 లక్షల చొప్పున రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఈ రూట్‌లో మాత్రం ప్రయాణికుల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయి. ‘చిక్కడపల్లి నుంచి ప్రతి రోజు కోఠీ విమెన్స్ కాలేజికి వెళ్తాను. కాలేజీకి వెళ్లే టైంలో ఒక్కోసారి 20 నిమిషాలు ఎదు రు చూడాల్సివస్తోంది. ఇది చాలా ఇబ్బంది కదా’ అని ఓ విద్యార్థిని విస్మయం వ్యక్తం చేసింది.
సర్వీసులు పెంచాలి...
ఇప్పటికిప్పుడు సర్వీసులను పెంచితే తప్పఈ రూట్‌లో మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం కలగదు. ప్రస్తుతం 12 నిమిషాల నుంచి 15 నిమిషాలకు ఒకటి చొప్పున తిరుగుతోది. కనీసం 5 నిమిషాలకు ఒకటి చొప్పున తిరిగితే ప్రయాణికుల ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రోను పొడిగించనున్నట్లు తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఈ రూట్‌కు సైతం ప్రయాణికుల ఆదరణ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మార్గంలో ఇప్పటికే సర్వే పూర్తి చేయడంతో పాటు సమగ్రమైన నివేదిక సైతం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మూడు కారిడార్‌లలో కలిపి ఎల్‌అండ్‌టీ సంస్థ ఇప్పటి వరకు 69 కి.మీ.కుపైగా పూర్తి చేసింది. ఈ కారిడార్‌ను కూడా ఫలక్‌నుమా వరకు పొడిగిస్తే మూడు కారిడార్‌లలో కలిపి 74 కి.మీ వరకు పెరగనుంది. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment