వసంత్ విల్లా 75లో సీసీ కెమెరాల్లో దుండగుల దృశ్యాలు
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. హఫీజ్‌పేట వసంత్ విల్లాస్‌లోని 75వ విల్లాలో రామ్‌సింగ్ కుటుంబం నివాసం ఉంటోంది. రాంసింగ్ కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 6న ఉదయం 10 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి కామారెడ్డికి వెళ్లాడు. 7వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తు తెలియని నలుగురు దొంగలు ఇంట్లోకి వచ్చినట్లు తెలిసింది. అందరు చెడ్డీలపై ఉన్నారు. 6వ తేదీన అర్థరాత్రి ఇంటి వెనక ఉన్న వెంటిలేటర్ అద్దాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు.
వెంటనే మియాపూర్ పోలీసులకు డాక్టర్ రామ్‌సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో అక్కడికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు రామ్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. దొంగలు ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, బృందాలుగా విభజించి గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే వారికి పట్టుకుంటామని సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment