హైదరాబాద్: లాంగ్ రూట్– షార్ట్ జర్నీ. ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రూట్‌లలో కొన్ని నాన్‌స్టాప్ బస్సులను నడిపేందుకు కసరత్తు చేపట్టింది. ఐటీ కారిడార్‌లలో పని చేసే సాఫ్ట్‌వేర్ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, తదితర రెగ్యులర్ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నగరంలోని వివిధ మార్గాల్లో నాన్‌స్టాప్ బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
వచ్చే నెలలో అందుబాటులోకి రానున్న ఈ–బస్సుల్లో కొన్నింటిని నాన్‌స్టాప్‌గా నడపాలని యోచిస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండే రూట్‌లను ఇందుకోసం ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ బస్సులపై వివిధ వర్గాలకు చెందిన ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఆర్టీసీ ఒక సర్వే కూడా చేపట్టింది.
సాధారణ బస్సుల్లో కంటే నాన్‌స్టాప్ బస్సుల్లో కొద్దిగా చార్జీలు పెంచి నడపనున్నారు. వివిధ రూట్‌లలో రెగ్యులర్‌గా ప్రయాణం చేసే 60 నుంచి 70 మంది ప్రయాణికులు కలిసి తమకు చార్జీలు కొద్దిగా ఎక్కువైనా సరే డైరెక్ట్ బస్సులు నడపాలని కోరితే అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
నాన్‌స్టాప్ సర్వీసులుగా ఈ– బస్సులు..
త్వరలో నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టులోనే వీటిని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. సెప్టెంబరు రెండో వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 25 ఎలక్ట్రిక్ బస్సులను (ఈ–బస్సులు) ప్రత్యేకంగా నాన్‌స్టాప్ సర్వీసులుగా నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే బాచుపల్లి–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్–వేవ్‌రాక్, ఉప్పల్–మణికొండ, మియాపూర్–వేవ్‌రాక్ తదితర రూట్‌లలో ఈ బస్సులను నడపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment