హైదరాబాద్: పది అడుగుల ఎత్తు వినాయక విగ్రహం ధర రూ.45 వేలు. ఇంకొంచెం ఆకర్షణీయంగా ఉంటే రూ.50 వేలు. 18 అడుగుల గణనాథుడు రూ.2 లక్షల పైనే ఉన్నాడు. ఇక 25 ఫీట్ల మూర్తిని మండపంలో ఏర్పాటు చేయాలంటే రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. ఈసారి గణనాథుడి విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. నగరంలోని అనేక చోట్ల విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి 20 శాతం వరకు పెరిగినట్లు అంచనా.
వినాయక విగ్రహాల తయారీ కోసం వినియోగించే వివిధ రకాల ముడిసరుకు ధరలు, రవాణా చార్జీలు పెరగడంతోనే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని ధూల్‌పేట్, నాగోల్, మియాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులకు సైతం డిమాండ్ పెరిగిందని, ఎక్కువ మొత్తంలో చెల్లిస్తే తప్ప కళాకారులు లభించడం లేదని ధూల్‌పేట్‌కు చెందిన ఒక వ్యాపారి విస్మయం వ్యక్తం చేశారు.ఈ మేరకు గతేడాది కంటే ఈసారి కొంతమేరకు పెరిగాయన్నారు.
ఆకట్టుకునే ఆకృతుల్లో..
ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం అందమైన వినాయక విగ్రహాలు ముస్తాబయ్యాయి. కొన్ని చోట్ల అమ్మకాలు కూడా ఆరంభమయ్యాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన మండపాల నిర్వాహకులు హైదరాబాద్ నుంచే విగ్రహాలను తరలిస్తారు. ఈ మేరకు ధూల్‌పేట్, ఎల్‌బీనగర్, నాగోల్, ఉప్పల్, కార్ఖానా, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం విభిన్న ఆకృతుల్లో బొజ్జ గణపయ్య మూర్తులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.
ధరలు ఎందుకు పెరిగాయంటే..
► ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొబ్బరి పీచు, రంగులు తదితర వస్తువుల ధరలు పెరగడంతో విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకును హైదరాబాద్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు కూడా భారీగా పెరిగాయి. దీంతో విగ్రహాల ధరలను పెంచవలసి వచ్చిందని హస్తకళాకారులు చెబుతున్నారు. సుమారు 500కు పైగా చిన్న, పెద్ద కార్ఖానాలు ఉన్న ధూల్‌పేట్‌లో రూ.500 ఖరీదైన విగ్రహాలు మొదలుకొని రూ.3.5 లక్షల ఖరీదు చేసే విగ్రహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల సైజులను బట్టి 15 శాతం నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగాయి.
► గతేడాది రూ.40 వేలకు లభించిన విగ్రహాలు ఇప్పుడు రూ.45 వేలకు పెరిగాయి. 15 ఫీట్ల విగ్రహం రూ.85 వేల నుంచి 1.10 లక్షల వరకు పెరిగింది. ఎక్కువమంది కొనుగోలు చేసే 18 ఫీట్ల విగ్రహాల ధరలు కూడా రూ.2 లక్షలకు చేరాయి.
► చిన్న విగ్రహాలకు సైతం భారీ డిమాండ్ ఉంది. ధూల్‌పేట్‌లోని కళాకారులు ఇళ్లల్లో చిన్న విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి రూ.500 నుంచి రూ.2500 వరకు ధరలు ఉన్నాయి. ఈ ధరలకు అనుగుణంగానే వివిధ సైజుల్లో ఉన్న విగ్రహాలను అమ్మకానికి సిద్ధం చేశారు.
కార్ఖానా ఖర్చులు పెరిగాయి: గణేష్
నగరంలో విగ్రహాల తయారీ కోసం కోల్‌కతా, పుణె, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి కూడా కళాకారులను తీసుకొస్తాం. వాళ్లకు చెల్లించే జీతభత్యాలు ఈసారి బాగా పెరిగాయి. విగ్రహాల తయారీ పూర్తయ్యే వరకు భోజనం, వసతి కూడా కల్పించాలి. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల కార్ఖానా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి.
పోటీ కూడా ఎక్కువే : రాకేష్
ఒకప్పుడు ధూల్‌పేట్ విగ్రహాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్ని చోట్లా విగ్రహాలను తయారు చేసి అమ్ముతున్నారు. షోలాపూర్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మకానికి పెట్టారు. రూ.లక్షలు ఖర్చు చేసి విగ్రహాలను తయారు చేస్తే ఈ పోటీ వల్ల ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అలాగని నష్టానికి అమ్ముకోలేం కదా.
Comments
Please login to add a commentAdd a comment