హైదరాబాద్: మెట్రో రైలు, బస్సులో మహిళలకు ఆకతాయిల వేధింపులు ఎక్కువైపోయాయి. చేతులు, కాళ్లు తగిలించడం, మహిళల సీట్లలో కూర్చోవడం, వెకిలిచేష్టలు, సంజ్ఞలతో కామెంట్లు చేయడం వంటి ఘటనలు రాచకొండ పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో షీ టీమ్స్ పోలీసులు ప్రత్యేక గస్తీ కార్యాచరణ రూపొందించారు. మైట్రో, బస్సులలో సాధారణ ప్రయాణికుల్లా ఎక్కి, పోకిరీల చేష్టలను పసిగట్టి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్పెషల్ డెకాయ్‌లకు శ్రీకారం చుట్టారు.
ఉద్యోగుల ఎక్కువగా రాకపోకలు సాగించే వనస్థలిపురం, ఎల్బీనగర్, మల్కాజిగిరి వంటి ప్రాంతాలతో పాటు కాలేజీలు, స్కూళ్లు, ఫ్యాక్టరీలు, హాస్టళ్లు, కార్మికుల అడ్డాలలో ఈ డెకాయ్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ నిరంతరం డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది 868 పిటిషన్లు..
ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా రాచకొండ షీ టీమ్స్‌కు 868 పిటిషన్లు వచ్చాయి. వీటిలో 121 ఎఫ్‌ఐఆర్‌లు, 133 ఈ–పెట్టీ కేసులను నమోదు చేశారు. 222 కౌన్సెలింగ్ సెషన్లు జరిగాయి. వీటిలో 911 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. ఇందులో 613 మంది మైనర్లు, 298 మంది మేజర్లున్నారు. గతంలో షీ టీమ్స్‌కు పట్టుబడిన ఆకతాయిలకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో నెలకు ఒకసారి కౌన్సెలింగ్ నిర్వహించేవారు. ఈ నెల నుంచి ప్రతి వారం కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మహిళలను వెంబడిస్తూ రెండోసారి పట్టుబడితే 354 (డి), కామెంట్లు, టీజింగ్, బెదిరింపులకు పాల్పడితే 509, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నారు.
ప్రతి రోజూ అవగాహన కార్యక్రమాలు
రాచకొండలో ప్రసుతం 10 షీ టీమ్స్ బృందాలున్నాయి. ప్రతి టీమ్‌లో ఎస్‌ఐ/ఏఎస్‌ఐ ర్యాంకు అధికారితో పాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరు ప్రతి రోజూ విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, ఫ్యాక్టరీలు, స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాంతాలలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. – టి.ఉషారాణి , డీసీపీ, రాచకొండ మహిళా భద్రతా విభాగం
87126 62662 హెల్ప్‌లైన్ నంబరు
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మహిళలకు ఎదురయ్యే సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని తగిన పరిష్కారం అందించేందుకు రాచకొండలో కొత్తగా 87126 62662 హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక కౌన్సిలర్ అందుబాటులో ఉంటారు. బాధితులకు భరోసా కల్పిస్తూ, వారి ఇబ్బందులను పరిష్కరించడం వీరి విధి.
Comments
Please login to add a commentAdd a comment