హైదరాబాద్: నగరంలో మళ్లీ వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం గంట పాటు ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. సగటున రెండు నుంచి నాలుగు సెంటిమీటర్లకు పైగా వర్షం పాతం నమోదైంది. ఆ తర్వాత చినుకులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరగా, సర్వీస్ రోడ్లపై డ్రైనేజీ, నాలాల మ్యాన్‌హోల్స్ పొంగిపోర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్‌మెంట్ల సెల్లాల్లలో భారీ నీరు వచ్చి చేరింది.
ఆదివారం సెలవు దినం కావడంతో రోడ్లపై పెద్దగా వాహనాల రాకపోకలు లేకుండా పోయాయి. వివిధ పనుల కోసం బయటికి వచ్చిన వాహనదారులు మాత్రం రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యధికంగా లంగర్‌హౌస్, ఉస్మానియా యూనివర్సిటీల వద్ద 4.3 సెంటీమీటర్లు, సరూర్‌నగర్‌లో 4.0, మియాపూర్‌లో 3.8, ఎల్బీనగర్, సైదాబాద్ కుర్మగూడలలో 3.7, జుమ్మెరాత్ బజార్‌లో 3.6, చార్మినార్ వద్ద 3.5, నాగోలు 3.4, బంజారాహిల్స్ 3.2, రెయిన్‌బజార్, బేగంబజార్, నాంపల్లి, మోండా మార్కెట్, మారేడుపల్లి, కిషన్‌బాగ్, దూద్‌బౌలీ తదతర ప్రాంతాలో 3 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది.
లింగంపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి కిందకు భారీగా నీరు వచ్చి చేరింది. అండర్‌బ్రిడ్జికి రెండువైపులా బారికేడ్లను అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలివైపు వెళ్ళే వాహనాలను నల్లగండ్లలోని ఆర్‌ఓబీ మీదుగా మళ్ళించారు. ఆనంద్‌నగర్ కాలనీ మజ్జిద్ రోడ్డులో ఓ భారీ వక్షం నేలకొరిగింది. ఆ చెట్టు పడ్డ ప్రాంతంలో పలు కార్లు పార్కింగ్ ఉండడంతో చెట్టు కార్లపై పడి స్వల్పంగా ధ్వంసమయ్యాయి. మలక్‌పేట, ఖైరతాబాద్ జంక్షన్లలోనూ నీరు భారీగా నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment