హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుతీరిన మహాగణపతి తొలి పూజలను నేటి ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం 9.30 గంటలకు ప్రాణ ప్రతిష్ట (కలశ పూజ) నిర్వహించిన అనంతరం పూజలు ప్రారంభమవుతాయన్నారు. తొలి పూజలు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా జరుగుతాయన తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో గవర్నర్ తమిళిసైని కలిసి ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజలకు ఆహ్వానించారు. తొలిపూజలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొంటారు.
భారీ బందోబస్తు..
చవితి మొదటి రోజు నుంచే మహాగణపతిని దర్శింకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ రైల్వేగేట్, మింట్ కాంపౌండ్ నుంచి భక్తులను అనుమతిస్తారు. ప్రత్యేక క్యూలైన్లు, సీసీ కెమెరాల నిఘాతో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు. మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం వేళల్లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని, కార్లు, బైక్‌లతో కాకుండా మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని ట్రాఫిక్ ఏసీపీ రత్నం సూచించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
► ఈ నెల 18 నుంచి 28 వరకు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనానికి ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వచ్చే భక్తులు కొన్ని సూచనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. సోమాజిగూడ రాజీవ్‌గాంధీ సర్కిల్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలకు నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. రాజ్‌దూత్ చౌరస్తా నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లే సాధారణ వాహనాలకు ఎక్బాల్ మినార్ వైపు మళ్లింపు ఉంటుంది. మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ వైపు సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి లేదు.
నెక్లెస్ రోడ్డు రోటరీ చౌరస్తా నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు. తెలుగుతల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ప్లై ఓవర్‌కు మళ్లింపు, ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేన్ నుంచి ఖైరతాబాద్ రైల్వేగేట్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్న్యాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
పార్కింగ్ ప్రాంతాలివే..
► ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే వాహనదారులు ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు, ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకునే భక్తుల సంఖ్యను బట్టి ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ 90102 03626ను సంప్రదించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment