గౌరమ్మ తనయుడు గంగమ్మ ఒడికి | - | Sakshi
Sakshi News home page

గౌరమ్మ తనయుడు గంగమ్మ ఒడికి

Published Thu, Sep 28 2023 6:30 AM | Last Updated on Thu, Sep 28 2023 9:49 AM

- - Sakshi

గౌరమ్మ తనయుడు గురువారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కరిముఖుని సేవలో తరించిన భక్తజనులు గణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. బొజ్జ గణపయ్య భోగభాగ్యాలను కనులారా వీక్షించేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. నగరమే వేదికగా నలుచెరగులా అలరారిన గణేశుని దివ్య మంగళరూపాలను వరుసగా వీక్షించే అరుదైన సందర్భానికి స్వాగతం పలుకుతోంది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు దాదాపు 3వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లో నియమించింది. శోభాయాత్ర మార్గాన్ని చార్మినార్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహ్మద్‌ మహమూద్‌ అలీ బుధవారం ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించి పరిశీలించారు.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 74 బేబీ పాండ్స్‌ (నీటి కొలనులు) వద్ద నీటి క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ వివిధ మార్గాల్లో 535 బస్సులను నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 8 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రైళ్లను నడపనున్నారు.

హైదరాబాద్: గణేష్‌ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం గురువారం హుస్సేన్‌సాగర్‌లో జరగనుంది. దీనికి దాదాపు 19 కిలోమీటర్ల మేర భారీ ఊరేగింపు సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సిటీలోని మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనం పూర్తయిన తరవాత విగ్రహాలను తెచ్చిన ఖాళీ లారీల కోసం ప్రత్యేక రూట్లు కేటాయించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వీలున్నంత వరకు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు.

ఇతర వాహనాలకు నో..
నగరంలోని దాదాపు 30 గంటల పాటు ప్రైవేట్‌ బస్సులు, లారీలు (గణేషులను తెచ్చేవి మినహా), ఇతర భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ఆంక్షలు, మళ్లింపులు నేపథ్యంలో అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ వాహనాలు ఆంక్షలు మార్గంలో ఇటు–అటు మారడానికి బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ వద్ద అవకాశం కల్పిస్తున్నారు.

ప్రధాన ఊరేగింపు మార్గం:
● కేశవగిరి–నాగుల్‌చింత–ఫలక్‌నుమా–చార్మినార్‌–మదీనా–అఫ్జల్‌గంజ్‌–ఎంజే మార్కెట్‌–అబిడ్స్‌– బషీర్‌బాగ్‌–లిబర్టీ–ఎన్టీఆర్‌ మార్గ్‌ల్లో నిమజ్జనం జరుగుతుంది.

సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చేది:
ఆర్పీ రోడ్‌–ఎంజీ రోడ్‌–కర్బాలామైదాన్‌–ముషీరాబాద్‌ చౌరస్తా–ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌– నారాయణగూడ ‘ఎక్స్‌’ రోడ్‌–హిమాయత్‌నగర్‌ ‘వై’ జంక్షన్‌ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది.

ఈస్ట్‌జోన్‌ నుంచి వచ్చేది:
ఉప్పల్‌–రామాంతపూర్‌–అంబర్‌పేట్‌–ఓయూ ఎన్‌సీసీ–డీడీ హాస్పిటల్‌ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద సికింద్రాబాద్‌ రూట్‌ దాంతోకలుస్తుంది.

వెస్ట్‌ జోన్‌ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్‌ లేదా సెక్రటేరియేట్‌ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి.

నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్‌బాగ్‌ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్‌రోడ్‌, బేగంపేట్‌ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం.

వెస్ట్‌–ఈస్ట్‌ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్‌బాగ్‌ వద్దే అవకాశం ఉంటుంది.

వాహనచోదకులు సాధ్యమైనంత వరకు ఔటర్‌ రింగ్‌ రోడ్‌, బేగంపేట్‌ మార్గాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

సందర్శకులకు పార్కింగ్‌ ఇలా:
హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం కి.మీ పరిధిలో ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు కేటాయించారు.

అవి... ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్‌ మధ్య, బుద్ధ భవన్‌ పక్కన, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్‌ గార్డెన్స్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, గో సేవా సదన్‌, కట్టమైసమ్మ టెంపుల్‌. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు చేరుకోవాలి.

రాచకొండ పరిధిలో...

గురువారం ఉదయం 6 నుంచి 29 రాత్రి 8 గంటల వరకు రాచకొండ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. నిమజ్జన వాహనాలకు మినహా సాధారణ వెహికిల్స్‌కు సరూర్‌నగర్‌ ట్యాంక్‌, సఫిల్‌గూడ, కాప్రా ట్యాంక్‌, అంబర్‌పేట ఫ్లై ఓవర్‌ పనులు నిర్మాణంలో ఉన్నందున రామంతాపూర్‌ మార్గంలో వాహనాలకు అనుమతి లేదు. ఈ మార్గంలో వచ్చే నిమజ్జన వాహనాలను హబ్సిగూడ స్ట్రీట్‌నం–8 లేదా ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌లో మళ్లించి, సర్వే ఆఫ్‌ ఇండియా మీదుగా, ఏక్‌ మినార్‌ మసీదు, హబ్సిగూడ, తార్నాక మీదుగా వెళ్లాలి.

బైరామల్‌గూడ నుంచి చంపాపేట, చెంగిచర్ల నుంచి ఉప్పల్‌, నేరేడ్‌మెట్‌ నుంచి సఫిల్‌గూడ, ఆర్కే పురం నుంచి ఈసీఐఎల్‌, లాలాగూడ టీ జంక్షన్‌ నుంచి మిర్జాల్‌గూడ వరకు సాధారణ వాహనాలకు, గూడ్స్‌ వాహనాలకు అనుమతి లేదు. భక్తులు తమ వాహనాలను సరస్వతి శిశు మందిర్‌, సరూర్‌నగర్‌ పోస్ట్‌ ఆఫీసు, ఇందిరా ప్రియదర్శిని పార్క్‌లలో వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాలి.

నిమజ్జనం పూర్తయిన వాహనాలు ఇందిరా ప్రియదర్శిని పార్క్‌ మీదుగా సరూర్‌నగర్‌ పాత పోస్ట్‌ ఆఫీసు క్రాస్‌రోడ్‌, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌ పోస్ట్‌ ఆఫీసు వైపున తీసుకోవాలి.

సైబరాబాద్‌ పరిధిలో..

బాలానగర్‌ నుంచి ఫతేనగర్‌ బ్రిడ్జి, గోద్రెజ్‌ నుంచి ఎర్రగడ్డ, ఫిరోజ్‌గూడ నుంచి కూకట్‌పల్లి గోద్రెజ్‌ వై జంక్షన్‌, గూడెన్‌మెట్‌ నుంచి నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్‌లలో వాహనాలకు అనుమతి లేదు. అశోక్‌నగర్‌, బీరంగూడ నుంచి వచ్చే వాహనాలు బాచుపల్లి, గండిమైసమ్మ, ఓఆర్‌ఆర్‌ వద్ద మళ్లిస్తారు.

సంగారెడ్డి నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే వాహనాలను ఓఆర్‌ఆర్‌ మీదుగా మళ్లిస్తారు. నిమజ్జన వాహనాలకు ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌, హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ ఫ్లై ఓవర్‌, ఫోరంమాల్‌ ఫ్లై ఓవర్‌, బాబూజగ్జీవన్‌రామ్‌ ఫ్లై ఓవర్‌, ఖైత్లాపూర్‌ ఫ్లై ఓవర్ల మీదుగా ప్రవేశం లేదు.

హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటు:
ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 9010203626 లను సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement