చార్మినార్: అక్రమ డబ్బు విషయంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కుమారుడు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్‌తో పాటు గులాం ఖాదర్ జిలానీ అలియాస్ మన్నాన్‌లపై చార్మినార్ పోలీసులు సుమోటో కేసులు నమోదు చేశారు. గులాం ఖాదర్ జిలానీపై ఈ కేసుతో పాటు ఫైజల్ ఖాన్ అనే బాధితుడికి సంబంధించిన మహిళలను దుర్భాషలాడిన ఘటనలో మరో సుమోటో కేసు నమోదైంది. చార్మినార్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ ప్రాంతానికి చెందిన ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్, గులాం ఖాదర్ జిలానీలు స్నేహితులు.
ముఖీద్ చౌదరి అనే వ్యక్తి నుంచి అధిక మొత్తంలో డబ్బు దోపిడీ చేసిన వీరిరువురి మధ్య.. డబ్బుల పంపకంలో వివాదం తలెత్తింది. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారనే విషయంపై ఒక వాట్సాప్ వాయిస్ వీడియో ద్వారా వెల్లడైంది. సోషల్ మీడియా యూ ట్యూబ్ ద్వారా ఈ విషయం చార్మినార్ సబ్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఈ నెల 4న చార్మినార్ పోలీసు స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో 387 ఐపీసీ సెక్షన్ కింద సుమోటో కేసు నమోదైంది. అలాగే మరో వాట్సాప్ వైరల్ వీడియోలో గులాం ఖాదర్ జిలానీ అలియాస్ మన్నాన్.. ఫజల్ ఖాన్ అనే మరో వ్యక్తితో జరిగిన సంభాషణలో అతని ఇంట్లోని మహిళలను దుర్భాషలాడినట్లు స్పష్టమైంది. దీంతో గులాం ఖాదర్ జిలానీ అలియాస్ మన్నాన్‌పై ఐపీసీ 354, 505, 509 సెక్షన్‌ల కింద మరో సుమోటో కేసు నమోదైందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
భారీ ర్యాలీతో..
వాట్సాప్ వాయిస్ వీడియో ఆధారంగా దక్షిణ మండలం పోలీసులు శనివారం రాత్రి ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కుమారుడు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకుని నేరుగా పురానీహవేలీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయానికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే తన అనుచరులు, మజ్లిస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు డీసీపీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. అరెస్టులను వ్యతిరేకించారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. విచారణ అనంతరం 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసి వదిలేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. భారీ ర్యాలీతో చార్మినార్ పంచ్ మోహల్లాలోని తన నివాసానికి చేరుకున్నారు.
కేసులతో భయపెట్ట లేరు
తమపై అక్రమంగా కేసులు నమోదు చేసి మానసికంగా దెబ్బతీస్తూ వేధింపులకు గురి చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. తన కుమారుడు ఇంటికి చేరుకున్న అనంతరం శనివారం అర్ధరాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఉద్దేశపూర్వకంగా పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఎటువంటి కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామని..ఎవరికీ భయపడేది లేదని కుమారుడితో కలిసి ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment