బంజారాహిల్స్: అభిమానం హద్దులు దాటడంతో జూబ్లీహిల్స్‌లో బీభత్సం నెలకొంది. ఆరు ఆర్టీసీ బస్సులపై బిగ్‌బాస్ సీజన్–7 కంటెస్టెంట్ల అభిమానులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసుల వాహనాల పైనా దాడి చేయడంలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పలువురు కంటెస్టెంట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల వద్ద భయానక వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే..ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్స్ జరిగాయి. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఫైనల్స్ విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్ అభిమానులు నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. స్టూడియో నుంచి బయటికి వస్తున్న కార్లపై దాడులకు తెగపడ్డారు.
రన్నరప్ అమర్‌దీప్ కారు అద్దాలను ధ్వంసం చేయడంతో ఆయన కారులో నుంచి బయటికి పరుగులు తీసి ఓ చెట్టు చాటున దాక్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో కంటెస్టెంట్ అశ్విని శ్రీతో పాటు గత సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. అంతటితో ఆగక అటుగా వెళ్తున్న హెచ్‌సీయూ, రాణిగంజ్ డిపోలకు చెందిన ఆరు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఓ డ్రైవర్‌కు రాయి తగిలి గాయమైంది. రాణిగంజ్ డిపోకు చెందిన డ్రైవర్ ఖాసిం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసు వాహనాలపైనా దాడికి దిగడంతో సీపీ రిజర్వ్ పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దాడులకు పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో స్టూడియో యజమానుల నిర్లక్ష్యం ఉందని భావించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేసుకోకుండా స్టూడియో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా దర్యాప్తులో తేలింది. కంటెస్టెంట్లపై అదుపు లేనందునే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బిగ్‌బాస్ సీజన్–7 విజేతపై క్రిమినల్ కేసు నమోదు
బిగ్‌బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హీరో నాగార్జున బిగ్‌బాస్–7 విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించారు. అప్పటికే రన్నరప్ అమర్‌దీప్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్టూడియో బయట వేచి ఉన్నారు. వారికి తోడుగా పలువురు కంటెస్టెంట్ల అభిమానులు అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో పల్లవి ప్రశాంత్‌ను రెండో గేటు నుంచి జూబ్లీహిల్స్ ఎస్‌ఐ రాకేష్, సిబ్బంది బయటికి పంపించారు. తాను ఇంటికి వెళ్తున్నానని చెప్పిన ప్రశాంత్ కొద్దిసేపటికే తన అనుచరులతో కలిసి ఓపెన్‌టాప్ జీప్‌పై మళ్లీ స్టూడియో వద్దకు వచ్చాడు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న అమర్‌దీప్ అభిమానులు, ఇతర కంటెస్టెంట్ల అభిమానులు రాళ్లతో పరస్పర దాడులకు దిగారు.
ఈ ఘటనలో రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేసి ప్రశాంత్‌ను అక్కడి నుంచి పంపారు. అప్పటికే పరిస్థితి అదుపుతప్పడంతో పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్, సాయుధ బలగాలతో అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఎస్‌ఐ రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రశాంత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment