హయత్‌నగర్: రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ఆటో స్వల్పంగా దెబ్బ తినగా ఓ మహిళకు గాయాలయ్యాయి. ఆర్టీసీ అధికారుల కథనం ప్రకారం...దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన బస్సు (టీఎస్ 07జెడ్4106) బుధవారం ఉదయం చౌటుప్పల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వస్తుంది. హయత్‌నగర్‌లోని భాగ్యలత సమీపంలోకి రాగానే రహదారిపై ఉన్న ఓ రాయి బస్సు కింది భాగంలో తగిలింది.
దీంతో డ్రైవర్ ధర్మయ్య బ్రేకు వేసేందుకు ప్రయత్నించగా బస్సు ఆగలేదు. బ్రేకు పడకపోవడంతో బస్సు ఎడమ వైపునకు వెళ్లింది. దీంతో రోడ్డుకు ఎడమ వైపున ఉన్న వాహనాలపైకి వెళ్లింది. స్పందించిన డ్రైవర్ ముందు బ్రేకును వేయడంతో బస్సు అదుపులోకి వచ్చింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ మహిళతో పాటు మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ఆర్‌ఎం వరప్రసాద్, డీఆర్‌ఎంలు జగన్, సుచరిత, డీఎం శ్రీహరిలు సందర్శించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పిందని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment