గ్రేటర్‌లో మరిన్ని ఎలైట్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్లు | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో మరిన్ని ఎలైట్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్లు

Published Mon, Feb 5 2024 5:58 AM | Last Updated on Mon, Feb 5 2024 7:32 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో మరిన్ని ఎలైట్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్లు అందుబాటులోకి రానున్నాయి. మద్యం ప్రియులను ఆకట్టుకొనేలా.. అన్ని సదుపాయాలతో ఆధునికత ఉట్టిపడేలా ఏర్పాటు చేసే బార్‌లకు అనుమతినిచ్చేందుకు ఆబ్కారీ శాఖ సన్నాహాలు చేపట్టింది. విధివిధానాలను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటి వరకు ఎలైట్‌ బార్‌లకు ఎలాంటి టెండర్లు లేకుండానే అనుమతిస్తుండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటికి టెండర్లను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు. లిక్కర్‌ ధరలను పెంచకుండా ఎకై ్సజ్‌ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఎలైట్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు అనుమతుల ప్రతిపాదనను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

150 బార్‌లకు అనుమతులు..
ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో సుమారు 550కి పైగా రెగ్యులర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని సాధారణ జనతా బార్‌లు కాగా మరికొన్ని కనీస సదుపాయాలతో సేవలందిస్తున్నాయి. ఇక ఎలైట్‌ బార్‌ల సంఖ్య 100 లోపే ఉన్నట్లు అంచనా. ఇప్పుడున్న ఎలైట్‌ బార్‌లకు అదనంగా మరో 150కి పైగా కొత్త బార్‌లకు అనుమతినివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు రూ.లక్షల లైసెన్స్‌ ఫీజుతో అనుమతులిచ్చారు. కొత్తగా అనుమతించనున్న ఎలైట్‌ బార్‌లకు టెండర్లను నిర్వహించడం ద్వారా మరింత ఆదాయాన్ని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 150 వరకు బార్‌లకు అనుమతించాలని ప్రతిపాదించినప్పటికీ వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

అదనపు ఆదాయమే లక్ష్యం..
ఆదాయం పెంచుకొనేందుకు గత ప్రభుత్వం లిక్కర్‌ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. మరోసారి లిక్కర్‌ ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం వాటి ధరల జోలికి వెళ్లకుండా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఎకై ్సజ్‌శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఎలైట్‌ బార్‌ అండ్‌రెస్టారెంట్‌లకు 2017లోనే జీఓ విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రస్తుతం ఈ జీఓను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.రెగ్యులర్‌ బార్‌లకు రూ.40 లక్షల చొప్పున ఫీజు వసూలు చేస్తుండగా, ఎలైట్‌ బార్‌ల ఫీజు రూ.50 లక్షల వరకు ఉంటాయి. అలాగే ఏటా 25 శాతం చొప్పున ఫీజు పెంచుతారు. ఎలైట్‌బార్‌లు రెగ్యులర్‌ బార్‌ల కంటే అదనపు సదుపాయాలతో ఉంటాయి. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలైట్‌బార్‌లను ఏర్పాటు చేస్తారు. లిక్కర్‌ బాటిళ్ల కోసమే సుమారు 2000 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. బార్‌ మొత్తం పూర్తిగా సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సదుపాయంతో ఉంటుంది. వినియోగదారులకు శుచిగా, శుభ్రంగా, అత్యంత నాణ్యమైన పద్ధతుల్లో ఆహారాలను, స్నాక్స్‌ను వండి వడ్డించేందుకు చక్కటి ఆల్ట్రామోడరన్‌ కిచెన్‌ ఉంటుంది. విశాలమైన పార్కింగ్‌ స్థలంతో పాటు అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రమాణాల మేరకు ఏర్పాటు చేసే బార్‌లకే ఎలైట్‌ అనుమతులను ఇస్తారు.

ఎలైట్‌ వైన్స్‌ సైతం..
ఎలైట్‌ బార్‌ల తరహాలోనే ఎలైట్‌ వైన్‌షాపులకు కూడా అనుమతులనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 750కి పైగా వైన్‌షాపులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని వాక్‌ ఇన్‌ వైన్స్‌గా నిర్వహిస్తున్నారు. మద్యం ప్రియులను ఆకట్టుకొనేవిధంగా ఏర్పాటు చేసే వాక్‌ ఇన్‌ వైన్స్‌ కోసం అదనంగా రూ,5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ వైన్స్‌ కంటే ఈ వైన్స్‌లో ఎక్కువ రకాల బ్రాండ్‌లకు చెందిన లిక్కర్‌ అందుబాటులో ఉంటుంది. కొన్ని చోట్ల వివిధ రకాల విదేశీ బ్రాండ్‌లను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు నగరంలో ఎలైట్‌ వైన్స్‌ లేవు. జూబ్లీహిల్స్‌లో ఉన్న టానిక్‌ లిక్కర్‌మాల్‌ మాత్రమే ఎలైట్‌ వైన్‌ షాపుగా అనుమతిని కలిగి ఉంది. టానిక్‌ తరహాలోనే మరిన్ని ఎలైట్‌ షాపులకు అనుమతులను ఇవ్వనున్నట్లు సమాచారం.

ఉన్న బార్‌లే దివాలా తీస్తున్నాయి
కోవిడ్‌ కాలం నుంచి బార్‌లు నష్టాల్లో నడుస్తున్నాయి. గతంలో కొత్తగా అనుమతించిన 150 బార్‌లలో కనీసం 70 బార్‌లను ఇప్పటికీ ఓపెన్‌ చేయలేదు. వైన్‌షాపులలో పర్మిట్‌ రూమ్‌లకు అనుమతినివ్వడంతో బార్‌లకు నష్టం వస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ఎలైట్‌ బార్‌లకు అనుమతినివ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

–శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ రెస్టారెంట్స్‌ అండ్‌ బార్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement